Beggar donates rs 50 thousand temple in visakhapatnam
mictv telugu

యాచకుడి గొప్ప మనస్సు..సంపాదించింది తిరిగి దేవుడికి..

November 13, 2022

దానం చేయాలంటే ధనవంతులే కావలసిన అవసరం లేదు..గొప్ప మనస్సుంటే చాలు అని చాటి చెప్పాడు విశాఖలోని ఓ యాచకుడు. దాతల నుంచి యాచించగా వచ్చే నగదును తిరిగి దేవునికి దానం చేసి తన మంచి మనస్సును చాటుకున్నాడు. తన సంపాదనలో కొంత మొత్తాన్ని దానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

విశాఖలోని నక్కవానిపాలెంలో ఉన్న ప్రముఖ దేవాలయం ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి పురంధర్ అనే యాచకుడు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాడు. అతని వద్ద ఉన్న లక్ష రూపాయలలో 50 వేలను స్వామివారికి ఇచ్చేశాడు. మిగిలిన సగం తనకు అనారోగ్యం చేస్తే వైద్య ఖర్చుల కోసం దాచుకున్నట్లు వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పురంధర్‌ 14 ఏళ్ల క్రితం విశాఖ నగరానికి వలస వచ్చాడు. అప్పటి నుంచి ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్దనే భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అయితే ఇటీవల అతని బ్యాగ్‌ను ఆలయం నుంచి విసిరేయడంతో అతని వద్ద ఉన్న డబ్బులు బయటపడ్డాయి. వాటిని మొత్తాన్ని ఆలయ అధికారుల లెక్కించగా రూ.లక్ష ఉన్నట్లు తేలింది. మొదట ఆ డబ్బుపై అనుమానం పడిన దేవాలయ అధికారులు తర్వాత భక్తులు దానం చేసిందేనని తేల్చారు. దీంతో పురంధర్‌ అందులోని సగం సొమ్మును స్వామి వారికి విరాళంగా సమర్పించుకున్నాడు. రూ. 50 వేల విలువైన నాణేలను హుండీలో వేశారు. అతని దానగుణాన్ని తెలుసుకున్న వారంతా ప్రశంసిస్తున్నారు.