సాయిబాబా గుడికి రూ. 8 లక్షలు ఇచ్చేసిన బిచ్చగాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

సాయిబాబా గుడికి రూ. 8 లక్షలు ఇచ్చేసిన బిచ్చగాడు..

February 14, 2020

Beggar.

దేవాలయాల ముందు కొందరు అడుక్కుంటారు. అంతో ఇంతో పోగుచేసుకుంటారు. కానీ, విజయవాడ ముత్యాలంపాడులోని షిర్డీ సాయిబాబు గుడి ముందు అడుక్కునే యాదిరెడ్డి రూటే సపరేటు. ఆలయాల గుళ్లముందు భిక్షాటన చేసే యాదిరెడ్డి… అట్లా రోజూ వచ్చే డబ్బులన్నీ పోగేస్తూ.. మళ్లీ గుడులకే విరాళంగా ఇస్తున్నాడు. సాయిబాబా గుడికి కొన్నేళ్లలో 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. గతేడాది 2018 జులై 26న సాయిబాబా మహాసమాధి అయి వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన నారికేళ జలాభిషేకానికి తనవంతుగా లక్షా 8 వేల భారీ విరాళాన్ని అందించాడు. గుడి గౌరవాధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లాడుతూ..యాదిరెడ్డి ఇప్పటికే ఆలయంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వెండి ఆభరణాలు చేయించాడని చేయించాడని తెలిపాడు.

యాదిరెడ్డి ఒకప్పుడు రిక్షా లాగుతూ బతికేవాడు. మోకాలి చిప్పలు అరిగిపోయి, రిక్షా తొక్కలేని పరిస్థితి రావడంతో గుడుల ముందు యాచక వృత్తి చేపట్టాడు. మొదట్లో తాను లక్ష రూపాయలను గుడికి విరాళంగా ఇచ్చానని యాదిరెడ్డి తెలిపాడు. అప్పటి నుంచి తనకు గుర్తింపు వచ్చిందని.. పైసలు కూడా బాగా వేస్తున్నారని వెల్లడించాడు. ‘ఒక్క సాయిబాబా గుడికే కాకుండా మరికొన్ని ఆలయాలకు కూడా డబ్బులు ఇచ్చేశా. నా జీవితమంతా దేవుడి సన్నిధిలోనే గడిపేస్తాను..’ అని అన్నాడు. యాదిరెడ్డి స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా చింతాబాయి గ్రామం. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో 11 ఏళ్ల వయసులో విజయవాడకు వచ్చాడు. ఇప్పుడు ఆయన వయసు 73 ఏళ్లు.