Beggar Poolpandian donates Rs 51 lakh to CM's relief fund
mictv telugu

సీఎం సహాయ నిధికి రూ.51లక్షల విరాళమిచ్చిన బిచ్చగాడు

November 2, 2022

దానాలు చేయడానికి, విరాళాలు ఇవ్వడానికి పెద్ద పెద్ద కోటీశ్వరులై ఉండక్కర్లేదని, సాయం చేసే గొప్ప మనుసుంటే చాలని నిరూపించాడు తమిళనాడుకి చెందిన ఓ బిచ్చగాడు. బిచ్చమెత్తుతూ సంపాదించిన మొత్తంలో ఇప్పటివరకూ రూ.51 లక్షలు సీఎం సహాయ నిధికి విరాళాం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం సమీపం అలంగికినరుకు చెందిన పూల్‌పాండియన్‌ (72) బిచ్చమెత్తుతూ ద్వారా జీవనం చేస్తున్నాడు. తనకు వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన సొమ్ముతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు లక్షల రూపాయలను పలు జిల్లాల కలెక్టర్లకు అందించాడు.

అంతేకాదు.. కరోనా కాలంలో రాష్ట్రప్రభుత్వం పిలుపుమేరకు కరోనా నివారణ నిధి, అనంతరం శ్రీలంక తమిళుల సంక్షేమ నిధి, సీఎం సహాయ నిధికి ఇప్పటివరకు కుదిరినప్పుడల్లా రూ.10 వేల చొప్పున అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, సోమవారం రామనాథపురం కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన పూల్‌పాండియన్‌ సీఎం సహాయ నిధికి రూ.10 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనను అభినందిస్తూ సర్టిఫికెట్లు అందజేశారని, ఏ జిల్లాలో యాచన చేసుకుంటున్నా సీఎం సహాయ నిధికి విరాళం ఇస్తున్నానని, ఇప్పటివరకు రూ.51 లక్షల వరకు విరాళం అందజేసినట్లు పూల్‌ పాండియన్‌ తెలిపాడు.