కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టింది. అసెంబ్లీలో కేసీఆర్ ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని, వారిని రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ఆర్థిక శాఖ తన కసరత్తును ప్రారంభించింది. అర్హులైన వారి జాబితాను పంపాలని అన్ని శాఖలకు లేఖలు రాసింది. కాగా, గతంలోనే క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోగా, కోర్టు కేసుల వల్ల ఆలస్యమైంది. గత డిసెంబరులో కోర్టు కేసు కొట్టివేయడంతో ఇప్పుడు ఏ అడ్డంకులు లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం వేగం పెంచింది. 2016లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతిపాదనలు పంపాలని కోరింది. కేటాయించిన పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ల ప్రకారం విధుల్లో ఉన్న ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేయడం సాధ్యమవుతుంది. దీంతో ఆర్థిక శాఖ పరిశీలన, ఆమోదం కోసం ప్రతిపాదనలు త్వరగా పంపాలని రామకృష్ణారావు ఆదేశించారు.