మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే చిన్నయ్య దాడికి దిగారు. గత నెలలో ప్రారంభమైన మందమర్రి టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల నుంచి టోల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కారు అక్కడకు చేరుకోగానే టోల్‌ప్లాజా సిబ్బంది ప్రోటోకాల్ పాటించకుండా ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారట. అంతేకాకుండా ఎమ్మెల్యే కారుకు రూట్ క్లియర్ చేయలేదని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ.. టోల్ ప్లాజా సిబ్బందిపై బూతులు తిట్టారు. వారిపై చేయి చేసుకున్నారు. అక్కడున్న వారిని భయ భ్రాంతులకు గురిచేశారు. కారు దిగి నానా హంగామా చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో.. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే.. మరొకపక్క టోల్గేట్ సిబ్బందే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరుల వెల్లడించారు. కావాలనే ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారని, రూట్ క్లియర్ చేయలేదని ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు కొత్తేం కాదు. గతంలోనూ తనపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఎదైనా పిచ్చి పోస్టులు పెడితే సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు. అంతకుముందు కూడా బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురుకు ఫోన్‌చేసి బెదిరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఓ భూ వ్యవహారంలో తలదూర్చి, పంచాయతీరాజ్ డీఈఈపై మాటలతో విరుచుకుపడ్డారు. బెల్లంపల్లికి చెందిన సొంత పార్టీ మహిళా నేత తోడె పద్మారెడ్డి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.