అటవీశాఖ అధికారి శ్రీనివాస్ రావును గుత్తికోయలు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుత్తికోయలు ఉంటున్న బెండలపాడు గ్రామ పంచాయి కీలక నిర్ణయం తీసుకుంది. గుత్తికోయలను బహిష్కరిస్తూ గ్రామసభలో తీర్మానం చేశారు. ఎర్రబోడులో నివసిస్తున్న గుత్తికోయలను బహిష్కరించి వారిని స్వరాష్ట్రం చత్తీస్ గఢ్ కు పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. గుత్తికోయలు నాటుసారా, గంజాయి సేవిస్తూ విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారని, మారణాయుధాలతో సంచరిస్తున్నారని ఆరోపించారు. వారి తీరు ప్రమాదకరంగా ఉందని, వారితో తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వారిని స్వరాష్ట్రానికి పంపించి తీరాలని కోరుతూ తీర్మానం చేశారు. అటు మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల గుత్తికోయలు తెలంగాణకు చెందిన వారు కాదని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని స్పష్టం చేశారు. పోడు భూముల విషయంలో గుత్తికోయలకు తెలంగాణలో ఎలాంటి హక్కులుండవని తేల్చి చెప్పేశారు.