benefites of coffee
mictv telugu

స్వర్గం నుంచి వచ్చిన అమృతం కాఫీ

December 29, 2022

benefites of coffee

ప్రేమ గుడ్డిది…రంగు, రుచి, వాసన కూడా ఉండవు అంటారు. అలా అన్నవాళ్ళకు కప్పుడు ప్రేమను తాగించి చూపించాలి. ప్రేమ ఏంటి? కప్పుడు ఏంటి? తాగించడం ఏంటి ? అనుకుంటున్నారా. అదేనండి కమ్మని కాఫీ అటే ప్రేమే కదా. అందుకే అలా చెప్పింది. ప్రపంచ ప్రేమకు పాత్రమైనది కాఫీ ఒక్కటే. కొందరికి కాఫీతో రోజు మొదలై కాఫీతోనే పూర్తవుతుంది. మరికొందరికి చేసే పనికి కారణం లేకపోయినా పరవాలేదు కానీ…కాఫీ మాత్రం ఉండాల్సిందే. ఇంకొందరు ఒత్తిడి నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే కాఫీ కావాల్సిందే. చాలా మందికి కాఫీ అనేది ఒక ఫీలింగ్. అది తాగిన తర్వాత వచ్చే కిక్ కోసం దాన్ని తాగుతారు. బ్రేక్ ఫాస్ట్.. లంచ్.. డిన్నర్.. ఇందులో ఏదైనా స్కిప్ చేయమంటే ఓకే అంటారు గానీ.. కాఫీకి మాత్రం నో చెప్పరు. కెఫిన్ ఇచ్చే మజా మరేదీ ఇవ్వదు అని అంటుంటారు కాఫీ ప్రియులు.

కాఫీ వల్ల ప్రయోజనాలు:

కాఫీ తాగిన వెంటనే కెఫిన్ కారణంగా శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజపూరితంగా మారుతుంది. అందుకే మనలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. చురుకుదనం ఉరకలేస్తుంది. కొంత మందికి వేళకు కాఫీ పడకపోతే ఊరికే చిరాకు వస్తుంది. నీరసం, విసుగు వంటివి కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మైల్డ్ డ్రగ్ కేటగిరీలోకే కాఫీ వస్తుంది. అయినా పర్వాలేదు…ఇది మన శరీరానికి చేటు చేయదు కాబట్టి ఈ డ్రగ్ కు ఫుల్ ఓకే. అసలు కాఫీ వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఇప్పటివరకు తాగని వారు కూడా తాగడం మొదలుపెట్టేస్తారు.

ప్రతీరోజూ కాఫీ తాగడం చాలా మంచిది అంటున్నారు. మన ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని కూడా చెబుతున్నారు. కాఫీలో కెఫెన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కేంద్రీయ నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల మన మెదడు చురుకుగా అవుతుంది. అల్జీమర్స్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అల్జీమర్స్ మీద జరిగిన పరిశోధనల్లో కాఫీ తాగిన వారికి ఈ వ్యధి రాలేదని తేలింది.

ప్రతీరోజూ కాఫీ తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు కాఫీని ఛాయిస్ గా చేసుకోవడం చాలా ఉత్తమం. అంతేకాదు దీనివలన ఎనర్జీ వస్తుంది. ఎక్సర్సైజ్, ఆటలు ఆడేవారు వాటికి ముందు కాఫీ తాగితే వాళ్ళల్లో శక్తి ఎక్కువసేపు ఉంటుంది. వాళ్ళు మరింత బాగా ఆడటానికి ఉపయోగపడుతుంది కూడా. ఇక టైప్ 2 డయాబెటీస్ తో బాధపడేవారు మిగతా పానీయాలకన్నా కాఫీని తాగడం మంచిది అంటున్నారు నిపుణులు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే కాఫీ కాలేయం, రోమ్ము కాన్సర్లు రాకుండా కూడా చేస్తుంది. కాఫీని యాంటీ కాన్సర్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు.

ఇక గుండెకు సంబంధించిన సమస్యలకు కూడా కాఫీ చెక్ పెడుతుందిట. సడెన్ హార్ట్ స్ట్రోక్ లు వచ్చే రిస్క్ ను కాఫీ తగ్గిస్తుంది. లాగే లివర్ సంబంధిత వ్యాధులు కూడా రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఆయా వ్యాధులు రాకముందు మాత్రమే. వచ్చిన తర్వాత డాక్టర్లు చెప్పినట్టు చేయాలి. అప్పుడు కాఫీ వద్దు అంటే మాత్రం తాగకూడదు.

ఎలాంటి కాఫీ తాగాలి:

కాఫీ తాగడం మంచిది సరే కానీ ఎలాంటి కాఫీ తాగాలి అన్నది కూడా తెలుసుకోవాలి. డీకెఫినేటెడ్ కాఫీ కంటే కెఫినేటెడ్ కాఫీ తాగడం బెస్ట్ అని మరో పరిశోధన ద్వారా వెల్లడైంది. కెఫినేటెడ్ కాఫీ పౌడర్‌లో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అదే.. డీకెఫినేటెడ్ కాఫీలో కొద్దిగా కెఫీన్ ఉంటుంది. టేస్ట్ మాత్రం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కెఫినేటెడ్ కాఫీని కంట్రోల్ తప్పనంత తాగితే ఫర్వాలేదని ఈ పరిశోధన తేల్చింది. ఐతే.. డీకెఫినేటెడ్ కాఫీ తాగిన వారిలో గుండె పని తీరు మందగిస్తుందని తమ అధ్యయనం ద్వారా బయటపడిందని పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ తాగే వారికి ప్రొస్టేట్ కాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ అని గతంలో మరో పరిశోధన తేల్చింది. బ్లాక్ కాఫీ కూడా మంచిదే. అలాగే.. ఇన్‌స్టెంట్ కాఫీ కంటే.. ఫిల్టర్ కాఫీ బెస్ట్ అట.

ఎంత తాగాలి:

కొంతమంది రోజులో లెక్క లేకుండా కాఫీ తాగేస్తుంటారు. కానీ.. కాఫీ కప్పులకూ ఓ లెక్కుంది. రోజుకు 400 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే మన శరీరం అనారోగ్యం పాలవుతుందట. 400 మిల్లీ గ్రాముల కెఫిన్‌తో తయారైన కాఫీ అంటే సుమారు 4 కప్పులు. అంటే.. రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే మేలు మాట అటుంచి.. హాని తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.