వంటలు ఘుమఘుమలాడాలంటే…అలా ఓ చిటికెడు ఇంగువ తగిలిస్తే చాలు. ఎక్కలేని వాసన, రుచి కూడా వచ్చేస్తాయి. పులిహోర, చారు, రోటీ పచ్చళ్లు, కూరల తాలింపులో.. చిటికెడు ఇంగువ వేస్తే ఆ రుచే రుచి. ఇంగువ వంట టేస్ట్ పెంచడానికే కాదు, మన ఆరోగ్యాన్ని రక్షించడానికీ ఇది సహాయపడుతుంది. సాంప్రదాయ వైద్యంలోనూ దీనికి ప్రత్యేక స్థానం ఉంది. స్వచ్చమైన ఇంగువను యునాని, సిధా, ఆయుర్వేద మెడిసిన్ తయారీలోనూ ఉపయోగిస్తారు. దీనిలో కార్మినేటివ్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇంగువలో ఫైబర్, ప్రొటీన్స్ , కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరటిన్, బి – విటమిన్, వంటి పోషకాలూ ఉంటాయి. ఇంగువను మన తరచుగా వంటల్లో వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం:
చిటికెడు ఇంగువ ఉంటే మనం ఈ మాట రోజూ హాయిగా అనుకోవచ్చును. మనం వేసేది పిసరంత అయినా అది మనకు చేసే సహాయం మాత్రం కొండంత. ఇంగువ జీర్ణ రసాలు ఉత్పత్తి అవడానికి తోడ్పడుతుంది. ఎంజైమ్‌ల చర్యను ప్రభావితం చేస్తుంది. ఇంగువ తీసుకుంటే.. అజీర్తి, కడుపులో మంట, ఉబ్బరం, IBS, పేగులో పురుగులు, అపానవాయువు సమస్యలు దూరం అవుతాయి. ఆకలి లేకపోవడం లాంటి సమస్యలతోపాటు జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. ఇంగువలో యాంటీ-స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. గ్లాసు మజ్జిగలో దీన్ని వేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఆస్తమా:
ఇంగువలో యాంటీ వైరల్, యాంటీబయాటిక్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆస్తమా, బ్రోన్కైటిస్, పొడి దగ్గులను ఇట్టే నయం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను ఇంగువ దూరం చేస్తుంది.వింటర్లో వచ్చే ఫ్లూను ఎదుర్కోవడానికి ఇంగువ నీరు బాగా పనికొస్తుంది.
బీపీ:
ఇంగువ న్యాచురల్ బ్లడ్ థిన్నర్‌లా పని చేస్తుంది. హైపర్‌టెన్షన్‌ను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది. ఇంగువలో కమారిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.
పీరియడ్ పెయిన్స్:
నెలసరి సమయంలో చాలా మంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు. దీనికి మంచి మందు ఇంగువ. ఇది ప్రొజెస్టెరాన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. కుడుపులో నొప్పిగా ఉన్నప్పుడు చిటికెడు ఇంగువ, మెంతిపొడి మజ్జిగలో కలుపుకుని తాగితే వెంటనే నొప్పి తగ్గిపోతుంది.
స్కిన్ ఇన్ఫెక్షన్లకూ:
ఇంగువ పొడిని కొబ్బరి నూనెలో కలిపి దురద ఉన్న చోట రాసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ప్రతిరోజు ఇంగువ నీటిని తాగితే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఇంగువలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
తలనొప్పి:
ఇంగువలోని బలమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలలోని రక్తనాళాలను సడలించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా, ఇంగువ యాంటిడిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి, మైగ్రెన్ తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.