జాజికాయ.. వంటగదికే కాదు, పడకగదికీ అండ! - MicTv.in - Telugu News
mictv telugu

జాజికాయ.. వంటగదికే కాదు, పడకగదికీ అండ!

November 20, 2019

Benefits .

సుగంధ ద్రవ్యాలలో జాజికాయకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఆహారానికి సువాసన, రుచి పెంచడంతో పాటు అనేక ఔషధ గుణాలను జాజికాయ కలిగి ఉంది. ఇది మెదడుకు ఒక అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది. అలసట, ఒత్తిడి, ఆందోళనలను దరిచేరనివ్వదు. నిద్రలేమి సమస్యతో సతమతం అయ్యేవారు జాజికాయ తీసుకుంటే మంచి గాఢనిద్ర పడుతుంది. ఒక చెంచా తేనె, చిటికెడు జాజికాయ పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని నిద్రించడానికి 15 నిమిషాల ముందు తాగాలి. దీంతో చక్కని నిద్ర పడుతుంది. 

ఇది ప్రధానంగా మగవారికి చాలా మేలు చేస్తుందని అంటారు. దీనిని పాలలో కలిపి తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పురుషులలో కామోద్దీప లక్షణాలను మెరుగుపరుస్తుంది. మగవారిలో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యలు ఉన్నవారు జాజికాయ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీనిని సేవించడం వలన శరీరానికి తక్షణ శక్తిని అందించి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. నరాల బలహీనతను దూరం చేసి వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని ఓ డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం సాయంత్రం పాలలో మరిగించి తాగాలి.  

జాజికాయ జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. డయేరియా, అపానవాయువు, మలబద్దకం, వాంతులు, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో జాజికాయ భేషుగ్గా పనిచేస్తుంది. కాలేయ, మూత్రపిండ వ్యాధులకు మేలు చేస్తుంది. కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో దోహదపడుతుంది. జాజికాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తాయి. దీనిని రోజూ పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన, మృదువైన చర్మాన్ని పొందొచ్చు. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. స్త్రీలకు రుతుక్రమ సమయంలో ఏర్పడే నొప్పులను తగ్గిస్తుంది. 

ఇందులోని పోషకాలు జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. అయితే జాజికాయను ఎలా వాడాలి? ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనేది ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు తీసుకుంటే మంచిది. జాజికాయ పొడిని చందనంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. ఇన్ఫెక్షన్లు ఉన్నచోట జాజికాయ నూరి పూతలా రాస్తే ఉపశమనం లభిస్తుంది. తామర వంటి చర్మ వ్యాధులు కూడా దూరం అవుతాయి. ఈ కాయలో లభించే ‘మినిస్టిసిన్’ అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ ఉపకరిస్తుంది. మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించవద్దు. అలా చేస్తే జీర్ణ సంబంధ సమస్యలతో పాటు ఏకాగ్రత కోల్పోవడం, చెమట ఎక్కువ పట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాజికాయ వాడకం విషయంలో జాగ్రత్త వహించాలి. గర్భవతులు దీనిని ఉపయోగించవద్దు.