కాలికి నల్లదారం కట్టుకోవడం సాధారణంగా చూస్తుంటాం. కొందరు ఫ్యాషన్ గా కట్టుకుంటే.. మరికొందరు సమస్యల నుంచి దూరం కావడానికి కట్టుకుంటుంటారు. అసలు ఈ నల్లదారం ఎందుకు కడుతారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదువండి.
భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైందేం కాదు. ఇది మన హిందూ సంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే. నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుందని నమ్ముతారు. అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులను వాడుతుంటాం. పిల్లలకి దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం, పాదానికి పెట్టడం.. ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రంగు ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని వాడుతారు.
శని రక్షకుడు..
నల్లదారం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు జ్యోతిష్యులు. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం.. దారం నలుపు రంగు శని (గ్రహం)ని సూచిస్తుంది. ఈ విధంగా చీలమండ చుట్టూ నల్లటి దారాన్ని ధరించడం వల్ల శని భగవానుడు మీ జీవితానికి మార్గదర్శకుడు, రక్షకుడు అవుతాడంటారు. కొందరు ఇలా నల్లదారం కట్టుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగుంటుందని నమ్ముతారు. రాహు కేతువుల బలం లేని వారు కూడా ఈ నల్లదారం కట్టుకోవాలని చెబుతున్నారు.
ఏ కాలికి.. ?
స్త్రీలు నల్లదారాన్ని శనివారం రోజున ఎడమకాలికి కట్టుకోవాలి. అలాగే మగవాళ్లు.. మంగళవారం రోజున కుడి కాలుకి కట్టుకోవాలని జ్యోతిష శాస్త్రం చెబుతుందట. అయితే ఇది ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా చెబుతున్నారు పండితులు. భైరవనాథ్ ఆలయం నుంచి తెచ్చే నల్ల దారం కట్టుకుంటే మంచిదట. అలాగే తొమ్మిది నాట్లు వేసి నల్లని దారాన్ని ధరించాలి. నలుపు దారం కట్టిన చోట మరే ఇతర రంగు దారమూ ముడివేయకూడదు. దారం పవిత్రతను కాపాడడానికి గాయత్రీ మంత్రాన్ని జపించాలని చెబుతున్నారు.