బీజేపీ అభ్యర్థిపై  దారుణం.. కాళ్లతో తంతూ  - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ అభ్యర్థిపై  దారుణం.. కాళ్లతో తంతూ 

November 25, 2019

Bengal BJP Leader Kicked By Trinamool Congress Workers

పశ్చిమ బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. చాలా కాలంగా రెండు పార్టీలు ఉప్పూ నిప్పులా వ్యవహరిస్తున్నాయి. తమ పట్టునిలుపుకోవడం కోసం పార్టీ నేతలు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు. ఒకరి సమావేశాలు మరొకరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సోమవారం కరీంపూర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌లోనూ ఘర్షణ జరిగింది. ఏకంగా బీజేపీ అభ్యర్థి,ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు జోయ్ ప్రకాశ్ మజుందార్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

పొలింగ్ సరళిని పరిశీలించేందుకు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ స్టేషన్ వద్దకు జోయ్ ప్రకాశ్ మజుందార్ వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న తృణముల్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే  గుంపులుగా దూసుకువచ్చిన ఆ పార్టీ శ్రేణులు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆయనపైకి దూసుకెళ్లి కొట్టే ప్రయత్నం చేశారు. వెనకాలే ఓ వ్యక్తి వచ్చి కాలితో గట్టిగా తన్నాడు. ఈ ఘటనతో పక్కనే ఉన్న చెట్ల పొదల గుంతలో  పడిపోయాడు. ఆయన అనుచరులు వచ్చి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనతో కొంత సేపు అక్కడ రణరంగాన్ని తలపించింది. పోలీసులు వచ్చి వెంటనే ఇరువర్గాలను చెదరగొట్టారు. 

ఈ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ చేసేందుకే తాను పోలింగ్ స్టేషన్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని జోయ్‌ప్రకాశ్ ఆరోపించారు. టీఎంసీ కార్యకర్తలు ఎంతగ రెచ్చిపోతున్నారో ఈ ఘటన రుజువు చేసిందన్నారు. తనపై జరిగిన దాడిలో గాయాలు మానవచ్చు కానీ, ప్రజాస్వామ్యంపై పడిన మచ్చ మాసిపోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో ఈ ఘటనే ఉదాహరణ అంటూ పేర్కొన్నారు. దీనిపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ఆయన ఆరోపణలను టీఎంసీ ఖండించింది. తమ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదని చెప్పారు. ఆయనపై వ్యతిరేకంగా ఉన్నవారే ఇలా చేసి ఉంటారని పేర్కొన్నారు. కాగా కరీంపూర్, ఖరగ్‌పూర్ సదర్,కలియా గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో పోలింగ్ చేపట్టారు.