పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం మమతా అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఇక నుంచి ముఖ్యమంత్రి వ్యవహరించేలా త్వరలోనే బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు మంత్రులు అంగీకారం తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూనివర్శిటీలకు ఛాన్సలర్‌గా గవర్నర్ వ్యవహరిస్తుండగా.. బెంగాల్లో ఆ హోదాను సీఎంకు మార్చాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడిందని.. దీనికి సంబంధించిన బిల్లు త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ఈ బిల్లుకు అసెంబ్లీతో పాటు గవర్నర్ ఆమోదం లభిస్తే.. అమలులోకి వస్తుందని, లేదంటే సొంత నిర్ణయంతోనే ముందుకెళ్లే అధికారం కలిగి ఉన్నామన్నారు. ఇప్పటికే బెంగాల్లో సీఎం మమతా బెనర్జీకి, గవర్నర్ జగదీప్ ధనకర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ తరుణంలో కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై మరోసారి వారి మధ్య వివాదానికి దారితీయనుంది.