‘‘జీవితాంతం ఎంత కష్టపడినా ఏం లాభం? వచ్చే సంపాదనంతా ఖర్చులకే సరిపోతోంది. చాలీ చాలని జీవితం, అప్పులు, తడిచి మోపెడయ్యే ఖర్చు.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఓ లక్ష దొరికితే బావుంటుంది. లేకపోతే కాస్త బంగారం. వీలైతే కోటి రూపాయల లాటారీ.. ’’ అని ఆలోచిస్తుంటారు సగటు పేదలు. రెక్కాడితే డొక్కాడని జీవితాలు మరింత ఘోరం. కేవలం పని కోసం అయినవాళ్లందర్నీ వదిలేసి వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్తుంటారు. కష్టపడి సంపాదించిన డబ్బులో తమ అవసరాలకు కొంత ఖర్చు పెట్టుకుని మిగతా సొమ్మును ఇంటికి పంపిస్తుంటారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్కే బాదేశ్ అనే కార్మికుడి జీవితం కూడా అంతే. పొట్టచేతబట్టుకుని కేరళకు వెళ్లిన అతణ్ని అదృష్ట లక్ష్మి కనికరించింది. ఒక్క దెబ్బతో దరిద్రం తీరిపోయి, రాత్రికి రాత్రి ధనవంతుయ్యాడు.
బాదేశ్ కొన్ని నెలల కిందట కేరళలోని ఎర్నాకులం జిల్లా చొట్టానిక్కారలో రోడ్డు నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నిరుపేద కావడంతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అప్పుడప్పుడూ లాటరీ కొంటుంటాడు. కేరళలో లాటరీలు చట్టబద్దమే. స్వయంగా ప్రభుత్వమే లాటరీ నిర్వహిస్తుంటుంది. స్త్రీశక్తి అనే ప్రభుత్వ లాటరీ టికెట్ కొన్నాడు బాదేశ్. పెద్దగా ఆశపడలేదు కూడా. వస్తే వస్తుంది, పోతే పోతుంది అనుకున్నాడు. కానీ మంగళవారం తీసిన డ్రాలో అతని టికెట్‌కు రూ.75 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. బాదేశ్ ఎగిరి గంతేసి తోటి పనివాళ్లకు చెప్పాడు. అందరూ సంతోషంలో మునిగిపోయారు. కానీ అంత డబ్బును ఎలా జాగ్రత్త చేసుకోవాలో తెలీక తికమకపడ్డాడు బాదేశ్. ఎవరైనా తనపై దాడి చేసి టికెట్ గుంజుకుంటారనే భయంతో పోలీసులను ఆశ్రయించాడు. త్వరలో డబ్బు అందగానే తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్లిపోతానని చెప్పాడు. లాటరీ డబ్బుతో ఇల్లు నిర్మించుకుని, పిల్లలను చదివించుకుంటానని చెబుతున్నాడు.