కాకినాడలో బెంగాల్ టైగర్ పంజా.. వణికిపోతున్న ప్రజలు - MicTv.in - Telugu News
mictv telugu

కాకినాడలో బెంగాల్ టైగర్ పంజా.. వణికిపోతున్న ప్రజలు

June 2, 2022

అడవుల్లో ఆహారం దొరక్క ఓ పెద్ద పులి కాకినాడ పరిసరాల్లో సంచరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. రాత్రి పూట అందరూ నిద్రిస్తుండగా, పశువులపై పడి నిర్దాక్షిణ్యంగా తన ఆకలిని తీర్చుకొని వెళ్లిపోతుంది. తాజాగా పాండవుల పాలెం పొదురుపాకలో ఆవును చంపి తినేసి వెళ్లిపోయింది. వరుస దాడులు చేస్తున్న పులి పాదముద్రలను చూసి ప్రజలను వణికిస్తోంది. వారం క్రితం వొమ్మంగిలో ఉన్న పులి అక్కడ నుంచి పొదురుపాకకు వచ్చింది. ఉదరవాడ మెట్ట మీద బస చేస్తూ రాత్రిళ్లు దాడి చేస్తున్న పులి జాడ కనిపెట్టడం అటవీ అధికారులకు పెద్ద సమస్యగా మారింది. అయితే పులిని పట్టుకోవాలంటే చిన్న విషయం కాదు. పెద్ద పులి మన జాతీయ జంతువైనందున ఎన్నో రూల్స్, ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటన్నింటినీ భర్తీ చేస్తూ పులిని పట్టుకోవాలంటే మాటలు కాదు. పట్టుకోవాలంటే మత్తు మందు ఇచ్చి సురక్షితంగా బోనులో బంధించాలి. ఎలాంటి ప్రమాదం కలుగనీయకూడదు. బంధించి తిరిగి అడవిలోనే సేఫ్‌గా విడిచి పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పులి జాడను కనుగొనేందుకు డ్రోన్లను సైతం వాడడానికి అధికారులు సాహసించడం లేదు. అంతేకాక, పులి దాడి చేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోతే దానిని వేటాడడానికి వీల్లేదు. ఇన్ని ఆటంకాల మధ్య పులిని పట్టుకోవాలంటే సాహసమనే చెప్పాలి. అయితే అసలు ఈ పులి ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవడం కూడా పెద్ద సవాలుగా మారింది. లోకల్‌గా పుట్టి పెరిగిందా? లేక రంపచోడవరం నుంచి వచ్చిందా? రెండోది నిజమైతే అంతదూరం పట్టణాలు, గ్రామాలను దాటుకొని ఎలా వచ్చిందని అధికారులు అన్వేషించే పనిలో పడ్డారు. ఈ లోపు ప్రజలు తమ జాగ్రత్తలో ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.