bengaloor IT employees going to offices in tractors
mictv telugu

భారీ వర్షాలు.. ట్రాక్టర్లలో ఆఫీసులకెళ్తున్న ఐటీ ఎంప్లాయీస్.. వీడియో

September 6, 2022

భారీ వర్షాలతో ఐటీ హబ్ బెంగళూరు అతలాకుతలమవుతోంది. వరద బీభత్సానికి సిలికాన్ సిటీ జలమయంగా మారింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహన దారులు అవస్థలు పడుతున్నారు. ఔటర్ రింగు రోడ్డు వంటి ప్రాంతాల్లో కూడా వరద నీరు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాలు స్విమ్మింగ్ ఫూల్స్‌ను తలపిస్తున్నాయి. వందల సంఖ్యలో గేటెడ్ కమ్యూనిటీలు చెరువుల్లా మారాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ప్రాంతాలైన వైట్ ఫీల్డ్, మహాదేవపుర, బొమ్మన హళ్లి ప్రాంతాలు నీట మునిగాయి. మారత హళ్లి, సిల్క్ బోర్డు, ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీపీఎల్ వంటి ప్రాంతాలు నీరు చేరడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఆఫీసులకు వెళ్లే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ వాహనాలను పక్కన పడేసి ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్ పోర్టు సమీపంలోని యోమలూరు ప్రాంతం నుంచి ట్రాక్టర్లలో వెళ్తున్న ఉద్యోగుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆఫీసులకు వెళ్లక తప్పదు. ట్రాక్టర్లు, జేసీబీల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒక్కొక్కరికి రూ. 50 తీసుకొని ఆఫీస్ వద్ద డ్రాప్ చేస్తున్నా’రంటూ ఓ ఐటీ ఎంప్లాయి వాపోయింది. కాగా, పలు ఐటీ కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రం హోం ఆఫర్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.