ఏవియేషన్ అనలిటికల్స్ సంస్థ సిరియమ్ తన నెలలవారీ ఆన్ టైమ్ పనితీరు నివేదికను ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం రెండు భారతీయ విమానాశ్రయాలు ఆన్ టైమ్ పనితీరులో అద్భుతంగా పనిచేశాయి. అందులో ఒకటి బెంగళూరుకు చెందిన కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, మరొకటి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి. 2022లో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంది. అలాగే దేశీయ, అంతర్జాతీయ సౌకర్యాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల కంటే భారతదేశం గత దశాబ్దంలో మరిన్ని విమానాశ్రయాలను నిర్మించింది. డీజీసీఏ టేటా ప్రకారం నవంబర్ 2022 వరకు దేశీయ విమానాల్లో 115లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారని అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఇది 20శాతం పెరిగింది.
గ్లోబల్ కేటగిరీ..
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 2022లో ప్రపంచంలో అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఏవియేషన్ డేటా అనలిటిక్స్ కంపెనీ అయిన సిరియమ్ చే జాబితాలో 20వ స్థానంలో నిలిచింది. దేశంలో అత్యంత సమయపాలన పాటించే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బెంగళూరు విమానాశ్రయం ఒక్కటే స్థానం పొందింది. కంపెనీ వైబ్ సైట్ ప్రకారం.. నవంబర్ వరకు 70.40శాతం అంతర్జాతీయ విమనాలు బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎటువంటి ఆలస్యం లేకుండా సమయానికి బయలుదేరాయి. నార్వే ఓస్లో విమానాశ్రయం 87.63తో మొదటి స్థానంలో నిలిచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సమయపాలన కలిగిన విమానాశ్రయంగా ప్రకటించబడింది. మిచిగాన్ లోని డెట్రాయిట్ మెట్రోపాలిటన్ వేన్ కౌంటీ విమానాశ్రయం, అమెరికాలోని ఉటాస్ సాల్ట్ లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఈ జాబితాలో రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.
బెంగళూరు విమానాశ్రయం ఇటీవల కొత్త టెర్మినల్ ప్రారంభించింది. దీనిద్వారా ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు. అయితే ఏప్రిల్ నాటికి టెర్మినల్ 2 ద్వారా అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను ప్రారంభిస్తారు. ఇదే కనుక జరిగితే ప్రతిసంవత్సరం సుమారు 25 మిలియన్ల మంది అంతర్జాతీయ ప్యాసింజర్లను చూడొచ్చు.
పెద్ద జాబితా..
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే 4వ పెద్ద విమానాశ్రయంగా నిలిచింది. ఇది 88.44 శాతంతో ఉంది. ఇక హక్కైడోలోని న్యూ చిటోస్ ఎయిర్ పోర్ట్ 92.95శాతంతో మొదటి స్థానంలో, ఒసాకా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ 91.11శాతంతో రెండవ స్థానంలో, ఫుకోయోకా విమానాశ్రయం 89.23తో మూడవ స్థానంలో నిలిచాయి. ఇకపోతే భారతదేశం నుంచి మీడియం, స్మాల్ కేటగిరీల్లోని ఏ విమానాశ్రయాలు టాప్ 20 జాబితాలోకి రాలేదు.