మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టినట్లు ఇదేం విచిత్రం? ఎక్కడా చూడలా? అని నొసలు ముడుస్తున్నారు కదూ! వింతే మరి. మనకు తెలియని విషయాలు ఈ సృష్టిలో కోకొల్లలు. విషయంలోకి వెళ్తే.. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఎప్పుడూ ఏవేవో అంతర్జాతీయ కార్యక్రమాలు జరగుతుంటాయి. వచ్చే నెల 13 నుంచి 17 వరకు నగర శివారులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ‘ఏరో ఇండియా 2023’ పేరుతో వైమానిక విన్యాసాలు జరగనున్నాయి. అసలే విమానాలు, ఆపై చిత్రవిచిత్ర విన్యాసాలు ఉంటాయి కనుక అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని రకాల మాంసాన్ని అమ్మకూడదని బృహత్ బెంగళూరు నగర పాలిక(బీబీఎంపీ) వ్యాపారులను ఆదేశించింది. ఎయిర్ ఫోర్స్ స్టేడియానికి 10 కిలోమీటర్ల పరిధిలో మటన్, చికెన్, చేపలను అమ్మకూడదని స్పష్టం చేసింది. వాటితో చేసి ఆహారాన్ని కూడా విక్రయించకూడదని, దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించింది. మాంసాహార వ్యర్థాల్ని వీధుల్లో పడేస్తే పక్షులు వాటి కోసం వస్తాయని, వాటి వల్ల విమాన విన్యాసాల్లో ప్రమాదం జరిగే అవకాశముందని మాంసంపై వేటు వేశారు. వినడానికి చోద్యంగా ఉన్నా, విలువైన ప్రాణాల కోసం కొన్నిరోజులు మాంసం మానేస్తే సరిపోతుందిలే అంటున్నారు స్థానికులు.