చెట్ల  బస్సు వైరల్.. నారాయణప్పకు కోటి దండాలు - MicTv.in - Telugu News
mictv telugu

చెట్ల  బస్సు వైరల్.. నారాయణప్పకు కోటి దండాలు

May 7, 2019

బస్సు ఎక్కినప్పుడు కిటికీ పక్కన సీటు దొరికితే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకంటే కిటికీలోంచి ఆహ్లాదకరమైన గాలికి చెట్లను, గుట్టలను చూడాలని అనుకుంటాం. కానీ అవే చెట్లు బస్సులోనే వుంటే ఎలా వుంటుంది. చాలా బాగుంటుంది కదూ. ఓ బస్సు డ్రైవర్ ప్రకృతి ప్రేమికులైన ప్రయాణికులకై తన బస్సునే మినీ గార్డెన్‌గా మార్చేశాడు. ఆ బస్సులో చాలా రకాల చెట్లు వుంటాయి. ఆ చెట్లను చూడగానే మనసు పరవశించని ప్రయాణికుడు వుంటాడా చెప్పండి. ఆ బస్సులో ఎక్కి దిగకూడదనుకునే ప్రయాణికులే ఎక్కువట. ఈ బస్సును చూడాలంటే బెంగుళూరు వెళ్లాల్సిందే మరి. ఈ ఆలోచనకు రూపమిచ్చిన ఆ డ్రైవరన్న పేరు నారాయణప్ప.

 బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు నారాయణప్ప. బస్సులో టీవీలు, డెక్కులకు బదులు మొక్కలతో నింపేసి బస్సును చిన్నపాటి బృందావనంగా మార్చేశాడు. ప్రయాణికుల బస్సు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేశాడు. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గత మూడు నాలుగేళ్లుగా బస్సులో మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిక్షణపై నారాయణప్ప అవగాహన కల్పిస్తున్నాడు. బస్సులోని మొక్కల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. రోజూ నీళ్లు పోసి వాటి సంరక్షణ చూస్తుంటాడు.

కొందరు ప్రయాణికులు ఈ బస్సులోని మొక్కల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ ఫోటోలు ట్విటర్‌లో తెగ వైరల్ అయ్యాయి. చాలామంది యూజర్లు నారాయణప్ప చేసిన మంచిపనిని మెచ్చుకుంటున్నారు. ఇలాంటివాళ్లు సమాజానికి చాలా అవసరం అంటున్నారు. చాలామంది డబ్బు, సంపాదన అంటూ సమాజానికి ఏమైనా చేద్దామనే ధ్యాసను మరిచిపోతున్నారు. అలాంటివాళ్లకు నారాయణప్ప కనువిప్పులాంటివాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.