పాక్ ఉగ్రవాదానికి సపోర్ట్.. బెంగుళూరు స్టూడెంట్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
పుల్వామా ఉగ్రదాడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఓ విద్యార్థికి కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. బెంగుళూరుకు చెందిన ఫైజ్ రషీద్ అనే బీటెక్ స్టూడెంట్.. పుల్వామా దాడిపై ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్టులకు పాక్ ఉగ్రమూకకు అనుకూలంగా పోస్ట్ చేశాడు. 2019లో జరిగిన పుల్వామా దాడిపై సోషల్ మీడియాలో పలు న్యూస్ ఛానళ్లు చేసిన పోస్టులకు వివాదాస్పద కామెంట్లు పెట్టాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అప్పుడే అరెస్టు చేశారు. రషీద్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. అప్పటి నుంచి నిందితుడు రిమాండ్లోనే ఉన్నాడు. బెయిల్ పిటిషన్ను కోర్టు పలు మార్లు తిరస్కరించింది. ఎట్టకేలకు రషీద్ కేసులో తీర్పు వెలువడింది. న్యాయస్థానం అతడికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు జడ్జి సిఎం గంగాధర అతనికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు.
రషీద్ నిరక్షరాస్యుడు కాదని, కావాలనే ఫేస్‌బుక్‌లో ఈ వ్యాఖ్యలను పోస్ట్ చేశారని న్యాయమూర్తి అన్నారు. ఇది జాతికి వ్యతిరేకమైందనీ, హేయమైందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు మతాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్నాయని ఆరోపించిన పోలీసులు ఫైజ్‌ను అరెస్ట్ చేసి, అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2019, ఫిబ్రవరి 24న పుల్వామా దాడి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల దాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.