‘నిత్యానంద చెర నుంచి మా కూతుళ్లను కాపాడండి..’ - MicTv.in - Telugu News
mictv telugu

‘నిత్యానంద చెర నుంచి మా కూతుళ్లను కాపాడండి..’

November 19, 2019

రాసలీల కేసులు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద ఆశ్రమంలో  ఇద్దరు అమ్మాయిల కేసు కలకలం రేపుతోంది. నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తమ కూతుళ్లను విడిపించాలంటూ ఓ జంట గుజరాత్‌ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది.  తమ ఇద్దరు కుమార్తెలను తమకు అప్పగించాలని పిటిషన్‌‌లో కోరారు. తమ కుమార్తెలను ఆశ్రమం నిర్వాహకులు మావద్దకు రాకుండా బెదిరిస్తున్నారని వారు పేర్కొన్నారు. జనార్థన శర్మ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ నలుగురిని బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో 2013లో చేర్పించారు. అప్పటినుంచి అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి తమ కుమార్తెల యోగక్షేమాలు తెలుసుకుని వస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో శర్మ నలుగురు కూతుళ్లను నిత్యానంద ధ్యానపీఠం నుంచి అహ్మదాబాద్‌లోని యోగిని సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు. 

Swami Nithyananda.

దీంతో తమ కూతుళ్లను కలిసేందుకు శర్మ దంపతులు అక్కడికి వెళ్లారు. అయితే వారిని సర్వఙ్ఞాన పీఠ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల సహాయంతో శర్మ దంపతులు ఆశ్రమానికి వెళ్లి తమ ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మేజర్లు అయిన మరో ఇద్దరు కూతుళ్లలో ముద్ర శర్మ(21), నందిత(18) తల్లిదండ్రులతో రామని చెప్పారు. దీంతో ఆ కన్నవాళ్లు ఆశ్రమ నిర్వాహకులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి.. తమతో రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. దయచేసి తమ కూతుళ్లు ఇంటికి తిరిగి వచ్చేలా ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. వారిద్దరినీ కోర్టు ఎదుట ప్రవేశపెట్టాక తమకు అప్పగించాలని వారు కోరారు.