Bengaluru: Woman gets lover to cut off husband's private part; both arrested for murder
mictv telugu

ఓ భర్త.. ఓ ప్రియుడు.. 15 మంది బాయ్ ఫ్రెండ్స్..

October 28, 2022

వివాహేతర సంబంధాలు ఎన్నో పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కొందరు మహిళలు ప్రియుడి మోజులో పడి అడ్డదారులు తొక్కి చివరకు అడ్డంగా బుక్కవుతున్నారు. ఆరు రోజుల క్రితం కర్ణాటక బెంగళూరులోని యెళహంకలో జరిగిన ఓ తెలుగు వ్యక్తి హత్య కేసులో కూడా భార్యే నిందితురాలిగా తేల్చారు పోలీసులు. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సురేశ్‌ను పిలిపించి హత్య చేయించినట్లు విచారణలో తేలింది.

ఇష్టం లేకున్నా మేనమామతో పెళ్లి..

ఏపీలోని పుట్టపర్తి జిల్లా హిందూపురానికి చెందిన చంద్రశేఖర్‌(35)కు అక్క కూతురైన శ్వేత(19) తో 4 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. తన కంటే 16 ఏళ్లు పెద్ద వాడైన వ్యక్తితో పెళ్లి ఇష్టం లేకున్నా.. పెద్దల బలవంతంతో ఒప్పుకుంది. పెళ్లైన తర్వాత కూడా శ్వేత కాలేజీకి వెళ్లేది. కాలేజీలో శ్వేతకు కొందరు యువకులతో స్నేహం ఏర్పడింది. పలువురు స్నేహితులతో డేటింగ్‌ చేసింది. టీవీలు, సినిమాలు చూసి అదే లోకం అనుకుంది. ఎక్కువ మంది బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉండడం గొప్ప అనుకుని అలాగే చేసేది. కనీసం 15 మంది బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉండేవారని, కొన్నిరోజులు షికార్లు చేసిన తరువాత వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టేదని తెలిసింది. ఇంటి యజమాని కుమారునితోనూ చనువుగా మెలిగింది. అతనితో బైక్‌పై కాలేజీకి వెళ్లేది. శ్వేత హిందూపురానికి చెందిన ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగిస్తోంది. సురేశ్‌ అప్పుడప్పుడు శ్వేత ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఇవి భర్త చంద్రశేఖర్‌కు తెలియడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి.

హత్య కోసం కొత్త సిమ్ కార్డు

ఈ క్రమంలో శ్వేత తన ప్రియుడితో కలిసి చంద్రశేఖర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఇక ప్రియుడు సురేశ్‌తో మాట్లాడానికి కొత్త సిమ్‌కార్డును కొని అందులో హత్య గురించి ప్లాన్ చెప్పింది. ఆమె చెప్పినట్లుగా అక్టోబరు 22న సురేశ్.. బెంగళూరు వచ్చాడు. ఇక భర్త చంద్రశేఖర్‌ పని నుంచి ఇంటికి రాగానే నీరు రావడం లేదు, పైకి ట్యాంకు వద్దకు వెళ్లి చూడాలని శ్వేత చెప్పింది. అతడు వెళ్లగానే అక్కడ దాగి ఉన్న సురేశ్‌ రాడ్‌తో తలపై కొట్టి, మర్మాంగం కత్తిరించి హత్య చేసి ఉడాయించాడు. తరువాత తనకేమి తెలియనట్లు శ్వేత నాటకమాడింది. భర్త శవంపై పడి వెక్కివెక్కి విలపించింది. ఆమెపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విషయమంతా వివరించింది.