Bengaluru:ఏం చేస్తున్నాము..? అసలు స్పృహ ఉండే ప్రవర్తిస్తున్నామా..? తినేది అన్నమా గడ్డా..? ప్రేమించిన వారినే పాశవికంగా చంపేస్తే సమాజం ఎటుపోతోంది..? లోపం ఎక్కడుంది..? ఒకటి కాదు రెండు కాదు భారత దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఏదో ఓ మూలన అమ్మాయిలపై ఆకృత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మాన మృగాలు క్షణికావేశంలో అతి క్రూరంగా హత్యలకు పాల్పడుతూ మహిళల భద్రతపై అనేక ప్రశ్నలను లేవెనెత్తుతున్నారు . ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, నేడు బెంగళూరులోనూ అతి కిరాతకంగా ఒక అమ్మాయిన కత్తితో పొడిచి మరీ చంపి తన కసిని తీర్చుకున్నాడో దుర్మార్గుడు. ఈ భయంకరమైన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో బెంగుళూరులో 25 ఏళ్ల యువతిని 28 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచి హత్య చేసి ఘటన తీవ్ర దుమారం రేపింది. నగరంలోని మురుగేష్‌పాళ్యం ప్రాంతంలోని ఒమేగా హెల్త్‌కేర్ కార్యాలయం సమీపంలో మంగళవారం రాత్రి 7.45 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు, నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
ఆంధ్రపదేశ్ లోని కాకినాడకు చెందిన లీలా ఎంఎస్సీ గ్రాడ్యుయేట్ , బెంగళూరులో ఒమేగా హెల్త్‌కేర్‌లో పనిచేస్తోంది. నిందితుడు దినకర్ దోమలూరులోని లాజిస్ హెల్త్‌కేర్‌లో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే దినకర్‌తో పెళ్లి విషయమై లీలా ఆమె తల్లిదండ్రులతో మాట్లాడింది. కులలు వేరు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో లీలా పెళ్లికి కులం సాకు చూపడంతో దినకర్ రగిలిపోయాడు. దినకర్ తీవ్ర ఆగ్రహంతో మంగళవారం లీలా ఆఫీసు నుంచి బయటకు వచ్చే వరకు అక్కడే కాపు కాసాడు. ఆమె బయటకు రాగానే, ఆమె కడుపు, మెడ, ఛాతీపై 16 సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు లీలాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
జీవన్ భీమా నగర్ పోలీసులు నిందితుడు దినకర్ పై హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దినకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.