2022 సంవత్సరంలో బాలీవుడ్ కనుమరుగైన పరిస్థితి. సౌత్ చిత్రాల దాడితో హిందీ ఇండస్ట్రీ కకావికలం అయిపోయింది. భారీ అంచనాలతో విడుదలైన బాలీవుడ్ చిత్రాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ చిత్రాలపై హిందీ ప్రేక్షకులకే మక్కువ సన్నగిల్లిన సంవత్సరం 2022 అని చెప్పొచ్చు. 2022లో బాలీవుడ్ పై తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్2, విక్రమ్, కాంతారల దెబ్బకు బాలీవుడ్ కోలుకోలేని పరిస్థితి. అయితే ఇంతటి సౌత్ డామినేషన్ ని తట్టుకుని కొన్ని హిందీ చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ దెగ్గర ప్రభావం చూపాయి. కరోనా తరువాత బాలీవుడ్ ప్రేక్షకులంతా ఓటీటీకి అలవాటైపోవటం కూడా డల్ కలెక్షన్స్ కి కారణం. ఒకప్పుడు బాలీవుడ్ ఫ్లాప్ సినిమాలు కూడా 100కోట్ల మార్క్ ని సునాయాసంగా దాటేసేవి. అయితే ఈ 2022 సంవత్సరంలో మాత్రం కేవలం 5చిత్రాలు మాత్రమే 100కోట్ల మార్కుని దాటాయి. మరి 2022లో మంచి వసూళ్లని సాధించిన ఆ టాప్ హిందీ చిత్రాలేంటో ఒక లుక్కేద్దామా.
1. ది కశ్మీర్ ఫైల్స్
2022లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా సంచలన విజయం సాధించింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి.. లాంటి ఎంతో మంది బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటించారు. రూ. 20 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా రూ. 252 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించి 2022లో అతిపెద్ద బాలీవుడ్ సినిమాగా అవతరించింది. హిందుత్వ సెంటిమెంట్, పొలిటికల్ సపోర్ట్ వంటి అంశాలు ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయి.
2. బ్రహ్మస్త్ర
మన బాహుబలికి బాలీవుడ్ కౌంటర్ అంటూ అతి భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ గా నిలిచిన చిత్రం `బ్రహ్మస్త్ర`. రణ్బీర్ కపూర్, ఆలియాభట్ ఇందులో జంటగా నటిస్తే.. మౌనీరాయ్, అమితాబ్ బచ్చన్, నాగార్జున తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఎన్నో వాయిదాల అనంతరం సెప్టెంబర్ 9వ విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ లో ఫ్లాప్ టాక్ తోను రూ. 236 కొట్లు రాబట్టి సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది బ్రహ్మస్త్ర.
3. దృశ్యం 2
అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ జంటగా అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `దృశ్యం 2`. ఇందులో టబు, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలను పోషించారు. మలయాళ `దృశ్యం 2`కు రీమేక్ ఇది. భారీ అంచనాల నడుమ ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 225 కోట్లు కొల్లగొట్టి మూడవ స్థానంలో నిలిచింది.
4. భూల్ భులయ్యా 2
ఈ ఏడాది బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన అతి కొద్ది చిత్రాల్లో ‘భూల్ భులయ్యా 2`కూడా ఒకటి. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ నటించిన ‘భూల్ భులయ్యా’ సినిమాకు సీక్వెల్ ఇది. ఇందులో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించారు. మే 20న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద రూ. 186 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
5. గంగూబాయి కతియావాడి
ఇక బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రమే గంగూబాయి కతియావాడి. ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన `మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై` అనే బుక్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి విజయం సాధించి.. రూ. 132 కోట్లు సాధించి టాప్ 5లో చోటు సంపాదించింది.
ఇక జగ్జగ్ జీయో, రామ్ సేతు, పృథ్వీరాజ్, భేదియా, లాల్ సింగ్ చద్దా, బచ్చన్ పాండే, రక్ష,బంధన్, షంషేరా, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి పెద్ద సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మంచి వసూళ్లనే సాధించాయి.