భారతదేశంలో అందమైన ప్రదేశాలు అంటే వెంటనే సౌత్ అని చెప్తారు. లేదా నార్త్, హిమాలయాల వైపు వెళ్ళిపోతారు. కానీ ఇటు ఉన్న ఒడిశాను ఎవ్వరూ పట్టించుకోరు. నిజానికి ఒడిశా మంచి పర్యాటక ప్రదేశం. ప్రకృతికి శోభతో నిండి ఉండే ఒడిశా గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అసలు ఒడిశాలో ఏమున్నాయో తెలుసా మీకు.
దేశంలోని అందమైన సముద్ర తీర రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. ఇక్కడ బోలెడు పర్యాటకపరమైన ప్రదేశాలున్…నా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అంతగా ప్రాచుర్యం పొందలేదు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుండి పూరీలోని జగన్నాథ్ ఆలయం వరకు ఎన్నో చారిత్రక, అరుదైన ఆలయాలు ఉన్నాయి. అలాగే గహిర్మాత ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ పొదుగు స్థావరం నుండి చిలకా సరస్సులోని వలస పక్షుల చూడడం వరకు ఇలా బోలెడు అరుదైన వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు ఉన్నాయి.
భువనేశ్వర్:
ఒడిశా రాజధాని భువనేశ్వర్ అద్భుతమైన నగరం. ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి.ఇక్కడ లింగరాజ ఆలయం, పరశురామేశ్వర ఆలయం, ఇస్కాన్ టెంపుల్, హీరాకుండ్ డ్యామ్, రాజరాణి టెంపుల్, బిందు సరోవర్, బ్రహ్మేశ్వర టెంపుల్, ముక్తేశ్వర టెంపుల్ చూడొచ్చు. దేవాలయాలు, ఆధ్యాత్మిక భావన ఎక్కువ ఉన్నవారికి ఇది చాలా మంచి ప్లేస్.
డియోమాలి:
కోరాపుట్ జిల్లాలోని డియోమాలి తూర్పు కనుమల్లోని అత్యుత్తమ హిల్ స్టేషన్లలో ఒకటి. ఇదో మంచి పిక్నిక్ స్పాట్.ఫ్యామిలీ పర్యటనలకు, వీకెండ్ ట్రిప్‌లకు అద్భుతంగా ఉంటుంది. అలాగే అడవుల్లో ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకు సూపర్ స్పాట్ ఇది.ప్రకృతి దృశ్యాలు ఇష్టపడేవారికి అయితే బంగారమే. ఇక్కడ అడవలో వన్యప్రాణులను కూడా చూసే అవకాశం ఉంటుంది.
పూరి:
ఒడిశా అంటేనే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ్ ఆలయం. ఏటా జరిగే వార్షిక ఉత్సవాల్లో ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ ఆలయం దేశంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి. ఈ గుడి ఏడాది మొత్తం భక్తులతో నిండి ఉంటుంది. అలాగే ఇక్కడున్న పూరీ బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ గుర్తింపు దక్కింది. సన్ సెట్ లకు పూరీ బీచ్ చాలా ఫేమస్.
ఉదయగిరి, ఖందగిరి గుహలు:
భువనేశ్వర్ నుండి కేవలం 15 నిమిషాల దూరంలో ఉండే ఉదయగిరి, ఖండగిరి గుహల అద్భుతమైన గుహ సముదాయాలు. ఇవి ఒకటో శతాబ్దానికి చెందిన అరుదైన గుహలుగా పేరుగాంచాయి. ఇందులో సహజసిద్ధంగా ఏర్పడినవి కొన్నైతే, మరికొన్ని మానవ నిర్మితాలు. అందువల్ల రెండూ కలగలసిన అందం వీటికి ఉంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి దృశ్యాల నడుమ ఉండే ఈ గుహలను అప్పట్లో జైనుల మతస్థులు నివాస ప్రాంగణాలుగా ఉపయోగించుకునే వారుట.
కోణార్క్:
మన దేశంలో ఉన్న రెండు సూర్యాదేవాలయాల్లో ఒకటి ఒడిశాలోనే ఉంది. ఇదో అరుదైన, అద్భుతమైన మానవ నిర్మాణం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ సూర్య భగవానుడి ఆలయం భారతదేశంలోనే రెండోది. మరో సూర్య దేవాలయం గుజరాత్‌లోని మోధేరా నగరంలో ఉంటుంది. గుర్రాలతో కూడిన భారీ రథం లాగ ఈ టెంపుల్ ఉంటుంది. మొత్తం రాయిని ఇలా మలచడం ఓ అద్భుతమనే చెప్పాలి.
చిలకా సరస్సు:
చిలకా సరస్సు ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సులలో ఒకటి. అలాగే భారతదేశంలోనే అతిపెద్దది కూడా. పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాల్లో విస్తరించిన ఈ సరస్సు పక్షుల నిలయం కూడా. ఇక్కడికి ఏటా శీతాకాలంలో వేలాది వలస పక్షులు వచ్చి అలరిస్తుంటాయి.
గహిర్మత, రుషికుల్య:
ఒడిశాలోని అరుదైన ప్రదేశాల్లో ఒకటి గహిర్మాత తాబేళ్ళ అభయారణ్యం. ఇక్కడికి ఏటా లక్షలాది ఆలివ్ రిడ్ తాబేళ్లు వచ్చి గుడ్లు పెడతాయి. మళ్ళీ అవి కొద్ది రోజులయ్యాక సముద్రంలోకి వెళ్ళాపోతాయి. ఆ సమయంలో ఈ గహిర్మాత సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తే చాలా అందంగా ఉంటుంది. బీచ్ అంతా తాబేళ్ళతో నిండిపోతుంది. రుషికుల్య కూడా అలాంటి ప్రాంతమే.