యువకుడి ప్రాణం తీసిన ‘ఫుల్‌బాటిల్‌’ పందెం - MicTv.in - Telugu News
mictv telugu

యువకుడి ప్రాణం తీసిన ‘ఫుల్‌బాటిల్‌’ పందెం

July 14, 2020

mhvf

మద్యం సేవించడంపై కాసిన పందెం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని  లక్ష్మణచాంద మండలంలోని చింతల్‌చాంద గ్రామానికి చెందిన షేక్‌ రసూల్‌(31) మామడ మండలం అనంతపేట్‌ గ్రామంలో మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తనతో పాటు పనిచేస్తున్న ఐదుగురు మేస్త్రీలు కలిసి మద్యం సేవించారు. 

పూటుగా తాగిన తరువాత మద్యం తాగడంపై పందెం కాశారు. ఫుల్‌బాటిల్‌ మద్యాన్ని 15 నివిుషాలలో తాగితే రూ.25వేలు ఇస్తామని ఇద్దరు మేస్త్రీలు రసూల్‌తో పందెం కాశారు. పందానికి రసూల్ ఒప్పుకున్నాడు. ఫుల్‌బాటిల్‌ మద్యాన్ని కూల్‌డ్రింక్స్‌లో కలుపుకుని‌ తాగడం మొదలుపెట్టాడు. సగం బాటిల్ తాగిన తరువాత కింద పడి అపస్మారకస్థితికి వెళ్ళాడు. దీంతో రసూల్‌తో కలిసి మద్యం తాగినవారు అక్కడినుంచి పరారయ్యారు. రసూల్ కింద పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా రసూల్ మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రసూల్ కు భార్య, కుమారుడు ఉన్నారు.