వానాకాలంలో  ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాహనాలు సేఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

వానాకాలంలో  ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాహనాలు సేఫ్

July 18, 2019

Beware of motorists in the rainy season...

వానాకాలంలో వాహనదారులకు వాటి భద్రత విషయంలో చాలా బెంగ వుంటుంది. వానలో బైకు గానీ, కారు గానీ నానిపోతే తుప్పు పట్టి, ఇంజన్ పాడైపోతుంది. దీంతో చాలా మంది వాటిని వర్షాకాలం అన్నిరోజులు పసిపిల్లల మాదిరి కాపాడుకోవాలి. చిన్నపాటి వర్షంలో వెళ్తున్నా అకస్మాత్తుగా వాహనం ఆగిపోతే అవస్థలు తప్పవు. జూన్ నెల నుంచే వర్షాలు పడతాయని భావించారు. కానీ, ఈసారి ఆలస్యమయ్యాయి. జూలై ఆరంభం నుంచే వానాకాల వాతావరణం కనిపిస్తోంది. మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వానలకు వాహనాలు తడిస్తే కొన్ని సందర్భాలలో ప్రత్యేక సమస్యలు తప్పవు. 

వానల్లో కారు బేజారు.. 

ఈ కాలంలో కార్లకు వైపర్స్ మంచి నాణ్యమైనవి ఉండాలి. బురద రోడ్లపై ఎక్కువగా స్కిడ్ అయ్యే అవకాశం ఉన్నందున నెమ్మదిగా వెళ్లడం చాలా మంచిది. కారు టైర్లలో తగినంత గ్రూపు ఉండేలా చూసుకోవాలి. తడిగా ఉన్న రోడ్లపై వెళ్లేటప్పుడు తగినంత వెలుతురు అవసరం. వాహనాలకు రకరకాల హైపవర్ లైట్లను ఏర్పాటు చేసుకోవడంతో ఆ వెలుతురు ధాటికి ఎదురుగా వస్తున్న వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల కార్లు, బస్సులు, లారీలు తదితర వాహనాలకు నిర్దిష్టమైన లైట్లు ఏర్పాటు చేసుకుంటే మంచిది. 

ద్విచక్ర వాహనాలు జాగ్రత్త.. 

వానల్లో ద్విచక్ర వాహనాలపై కాస్త ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం వుందంటున్నారు నిపుణులు. అవి వానలో తడిస్తే కచ్చితంగా సమస్యలు వస్తాయని మెకానిక్‌లు చెబుతున్నారు. ముఖ్యంగా లైట్లు మొరాయించడం, లాకింగ్ సిస్టం, హాల్టింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. స్టాటర్ మొరాయిస్తుంది.. పిన్నుకు తుప్పు పట్టి పాడైపోయే అవకాశాలు వున్నాయి. ఈ కాలంలో తప్పనిసరిగా చైను ప్రతి 500 కిలోమీటర్ల తర్వాత శుభ్రం చేయించుకోవాలి. గ్రీసు వంటివి ఉపయోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ఆయిలింగ్ చేయించుకోవాలి. వాటర్ సర్వీస్ జోలికి వెళ్లకపోవడం మంచిది. వానాకాలం ముగిసాక వాటర్ సర్వీసింగ్ చేయించుకోవాలి. బ్రేకులు మంచి కండిషన్‌లో వున్నవో లేదో చూసుకోవాలి. లేకపోతే నీటితో నిండిన లేదా తడి రోడ్లపై వెళ్లేటప్పుడు ప్రమాదాల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రేక్ వ్యవస్థలో లైనర్స్, డిస్కులు, లోపల డ్రమ్స్ వంటివి బాగున్నాయో లేదో పరిశీలించుకోవాలి. 

 వీలైనంత మేరకు వాహనాలు వర్షంలో తడవకుండా చూసుకోవాలి. బయట వుంటే కవర్లు కప్పాలి. లేదంటే షెడ్ల కింద పార్కింగ్ చేయడం మంచిది. వర్షాకాలంలో వ్యాక్స్ పాలిష్ చేయించుకోవాలి.