కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

August 4, 2020

Bhadrachalam EX MLA Sunnam Rajaiah No More

కరోనా కాటుకు తెలంగాణకు చెందిన సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూశారు. కొంత కాలంగా జ్వరంతో బాధపడుతున్న ఆయన విజయవాడలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయారు. దీంతో ఆయన అనుచరులతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎంతో చురుగ్గా ఉండే ఆయన ఆకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

పది రోజుల క్రితం నుంచి రాజయ్య జ్వరంతో బాధపడుతున్నారు. స్వగ్రామం నుంచి అతన్ని విజయవాడలోని కోవిడ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా.. కరోనా అని తేలింది. చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈసంఘటన భద్రాచలం నియోజకవర్గంలో విషాదాన్ని నింపింది. 

భద్రాచలం నియోజకవర్గ నుంచి సీపీఎం తరుపున సున్నం రాజయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1999, 2004, 2014లో విజయం సాధించారు. నిత్యం జనం మధ్య ఉంటూ నిరాడంబర జీవితం గడిపారు. ఎమ్మెల్యే అయినా కూడా ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సు, బైకులను ఆశ్రయించే వారు. 2019 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాజయ్య గతంలో పోటీ చేసిన చాలా మండలాలు ఏపీ విభజన తర్వాత పోలవరం ముంపు ప్రాంతాల కింద అందులో కలిపేశారు. దీంతో రంపచోడవరం నియోజకవర్గంలో కొన్ని, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని కలిసిపోయాయి. అప్పటి వరకు తనకు ఓటు బ్యాంకుగా ఉన్నవారంతా  ఏపీలో చేరడంతో అక్కడి నుంచే పోటీ చేశారు.