పంజాబ్ కొత్త సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం - MicTv.in - Telugu News
mictv telugu

పంజాబ్ కొత్త సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం

March 16, 2022

పంజాబ్ రాష్ట్ర నూతన సీఎంగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని చండీగఢ్‌లో కాకుండా భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కాడ్‌ కలన్‌లో పదవి స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ మాన్ చేత ప్రమాణం చేయించారు. అనంతరం అదే వేదికపై నుంచి సీఎం బాధ్యతలను స్వీకరించారు.

మరోపక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రజలంతా పసుపు రంగులో ఉండే తలపాగాలు, దుప్పటాలు ధరించారు. అంతేకాకుండా ఖట్కాడ్‌ కలన్‌ గ్రామం మొత్తం పసుపు మయంగా మారింది. వేదికను కూడా పసుపు వర్ణంలోనే ఏర్పాటు చేశారు.1970 తర్వాత పంజాబ్ రాష్ట్రంలో సీఎం పగ్గాలు చేపట్టిన చిన్న వయస్కుడు భగవంత్ మాన్ (48) కావడం విశేషం.

ఇటీవలే జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో 92 సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించింది. సంగ్రూర్ జిల్లా ధురి నుంచి పోటీ చేసిన భగవంత్ మాన్ 58 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.