మనిషిని గౌరవించని సంస్కృతిపై సమరశంఖం మన భాగ్యరెడ్డివర్మ
పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో దళిత జనోద్దరణ కోసం హైదరాబాద్ గడ్డపై ఓ గొంతు నినదించింది..మనిషిని మనిషి గౌరవించని సంస్కృతిపై సమరశంఖం పూరించింది..కులరక్కసిపై కన్నెర్ర చేసింది..ఆయనే దళిత జాతి ఆత్మగౌరవ పతాక భాగ్యరెడ్డివర్మ..పంచములం కాదు ఈ దేశ మూలవాసులమి ఎలుగెత్తి చాటిన దక్కన్ పూలె భాగ్యరెడ్డివర్మ .
చాతుర్వర్ణం మయా సృష్టం..గుణకర్మ విభాగశహ…భగవంతుడో…పరమాత్ముడి పేరు చెప్పి పుణ్యాత్ములో.. ఎవరో ఒకరు..వేలసంవత్సరాల క్రితమే అణగారిన వర్గాల తలరాతను తన్లాటగా మార్చారు.. జన్మ నా జాయతే శూద్రహ అన్న సత్యాన్ని సమాధిచేశారు..అందుకే పంచమర్ణ ఊబిలో చిక్కుకున్న అభాగ్యులను ఆధిపత్యం అణిచివేతగా శాసించింది..అంటరానితం అడుగడుగునా అవమానించింది…కులం పేరుతో కటికచీకటి కమ్ముకుంది..అయితే ఆ చీకట్లను తరిమేసేందుకు హైదరాబాద్ గడ్డపై ఓ పొద్దుపొడిచింది..వేగుచుక్కై…వెలుగు పంచింది..దళితజాతికి భాగ్యరేఖయింది..ఆ భాస్కరుడే దక్కన్ దళిత ఉద్యమ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ
1888 మే 22న హైదరాబాద్ లో దళిత జాతి ఆత్మగౌరవ పతాక రెపరెపలాడింది…మాదరి వెంకయ్య,రంగమాంబ దంపతులకు బాగయ్య పుట్టారు..దళిత కులంలో పుట్టినందుకు చిన్నతనంలోనే సమాజపు చిన్నచూపును చూశాడు..సామాజిక చైతన్యం ఉంటేనే ఆధిపత్యాన్ని,అణిచివేతను ప్రశ్నించవచ్చనుకున్న బాగయ్య…అందుకు చదువుకోవడమే మార్గమనుకున్నారు..వెనకబడ్డ కులంలో పుట్టినంత మాత్రాన…వెనకబడ్డట్టు కాదనుకున్నారు. ఆర్యులు రాకముందు మూలవాసీలే ఈ దేశ పాలకులన్న గురువు మాటలు బాగయ్య మనసులో నాటుకుపోయాయి..పేరుతోనే సామాజిక హోదాను ఇచ్చే సంస్కృతిని వెక్కిరిస్తూ తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నారు…ఆర్యసమాజ్ ఇచ్చిన వర్మ బిరుదుతో బాగయ్య….భాగ్యరెడ్డివర్మ అయ్యారు..
ఇరవయ్యే శతాబ్దం మొదట్లోనే బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి,అస్పృశ్యతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలొచ్చాయి. సామాజిక న్యాయం కోసం నినదించిన మహాత్మా జ్యోతీరావు పూలే వారసత్వాన్ని అందుకున్న భాగ్యరెడ్డివర్మ,అంబేద్కర్ కంటే ముందే దళితుల కోసం గొంతెత్తారు.మేము పంచములం కాదు.ఈ దేశ మూలవాసులం ఆది హిందువులమంటా ఉద్యమించారు..ఆదిహిందూ మహాసభను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. దళితుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించి హరిదాసులు,మాల జంగాల చేత హరికథలు చెప్పించారు..ఆ కార్యక్రమ ప్రారంభ,ముగింపు సమయాల్లో దళితులను ఉద్దేశించి భాగ్యరెడ్డి ప్రసంగించారు.దళితులే ఈ దేశపు మూలవాసులు..అంటరానితనాన్ని పాటించే ఆధిపత్య కులాలే పొట్టచేతపట్టుకుని మధ్య ఆసియా నుంచి వలసవచ్చారని విమర్శించారు..చదువు లేకపోవడం,అజ్ఞానం తోనే దళితులు వెనకబడి ఉన్నారనేవారు..అందుకే దళిత పిల్లలకు చదువు చెప్పించడానికి 1910 లో ఇసామియాబజారులో ప్రాథమిక పాఠశాలను స్థాపించారు..కొద్దిరోజుల్లోనే 2600 మంది పిల్లలతో 25 పాఠశాలలను నడిపారు…1911లో సబ్బండవర్ణాలతో సహపంక్తిభోజనాలు చేయించారు..వర్ణవ్యవస్థను,వైదిక ధర్మాన్ని నిరసిస్తూ బౌద్ద ధర్మాన్ని ప్రచారం చేశారు..
1911 లో ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ ను స్థాపించిన డ ఆదిహిందువుల అభివృద్ది కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు..1917 లో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన విజయవాడలో ప్రథమాంధ్ర ఆది హిందూ సదస్సు జరిగింది.. అదే సంవత్సరం కలకత్తాలో జరిగిన అఖిల భారత హిందూ సంస్కరణ సభలో భాగ్యరెడ్డి చేసిన ప్రసంగం గాంధీని ఆకట్టుకుంది..ఉత్తరభారతదేశంలో అంబేద్కర్ చేసిన ప్రతీ ఉద్యమానికి హైద్రాబాద్ లో భాగ్యరెడ్డి చేసిన దళిత ఉద్యమమే మూలమయింది…ఇంతేకాదు దేశవ్యాప్తంగా సాగిన ఆదిజన మూలవాసీ ఉద్యమానికి…మన భాగ్యరెడ్డి చూపించిన దారే మార్గమయింది..జంగములు,దాసరులతో పాటు దళిత ఉపకులాల మధ్య సమన్వయం కొరకు 1919లో ఆదిహిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు..దళితుల్లో అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు కులపెద్దల పంచాయితీ వ్యవస్థను తిరిగి ఏర్పరిచారు.ఆదిహిందువుల్లోని చేతివృత్తుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడానికి 1925లో ఆదిహిందూ చేతివృత్తుల వస్తుప్రదర్శనను నిర్వహించారు..
జాతీయ నిమ్నవర్గాల మహాసభలకు 1927 నుంచి 1931 వరకు భాగ్యరెడ్డే అధ్యక్షత వహించి విజయవంతం చేశారు..1931లో లక్నోలో జరిగిన సభలో ఆయనో చారిత్రాత్మక తీర్మానం చేశారు..దేశంలోని ఏడుకోట్ల దళితుల సమస్యలను బ్రిటీష్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ ను ప్రతినిథిగా పంపాలని నిర్ణయించారు..పంచములు,అవర్ణులు,మాల,మాదిగ పేర్లతో కాకుండా తమను ఆదిహిందువులుగానే పిలవాలన్నారు..భాగ్యరెడ్డి డిమాండ్ కు నిజాం ప్రభుత్వం దిగొచ్చింది..అందుకే 1931లో జరిగిన జనాభా లెక్కల్లో దళితులను ఆదిహిందువులుగా నమోదుచేసింది..
బాల్యవివాహాలు,జోగిని వ్యవస్థ రద్దు కోసం భాగ్యరెడ్డి కృషిచేశారు..దళితులలో విద్యావ్యాప్తితో పాటు వ్యసనాలు లేని సమాజం కోసం ఆయన పాటుపడ్డారు.భాగ్యరెడ్డివర్మ సేవలు ఒక్క హైదరాబాద్ సంస్థానికే పరిమితం కాలేదు..ఆయన ఉద్యమ ప్రభావంతో తమిళనాడు ,కర్నాటక,మహారాష్ట్ర తో పాటు ఆంధ్రా ప్రాంతంలోని దళితులు కూడా తమ సమస్యలపై ఉద్యమించారు…హైదరాబాద్ చాదర్ ఘాట్ దగ్గర ఆయన ప్రారంభించిన ఆదిహిందూ భవనం..ఎన్నో సామాజిక ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్ష్యమయింది..
దళితజాతి అభ్యున్నతికి ప్రతీక్షణం తపించిన భాగ్యరెడ్డివర్మ 1939 ఫిబ్రవరి 18న చనిపోయారు..ఆయన స్మారకచిహ్నంగా 1943లో ప్రారంభమైన బాలిక ఉన్నత పాఠశాల ఇప్పటికీ నడుస్తోంది..భాగ్యరెడ్డి జ్ఞాపకాలుగా ఇప్పుడవే మిగిలాయి..హైదరాబాద్ గడ్డపై ఎగిసిన దళితజాతి ఆత్మగౌరవ పతాక భాగ్యరెడ్డిని ప్రభుత్వాలు కూడా చిన్నచూపు చూశాయి..అందుకే ఈ గడ్డపై పుట్టిన మహానుభావుడి స్మృతి చిహ్నం ఒక్కటంటే ఒక్కటి కూడా హైదరాబాద్ లో లేదు..ఆయన పేరును ఓ రోడ్డుకు పెట్టి చేతులు దులుపుకున్న ప్రభుత్వాలు…ఆయన గౌరవార్థం చేసిందేం లేదనే విమర్శలు ఉన్నాయి. అంబేద్కర్ సమకాలికుడయిన భాగ్యరెడ్డిని తక్కువ చేసి చూడడమంటే మనల్ని మనమే అవమానించుకున్నట్టే…