డాన్స్ డాన్స్ భళారే డాన్స్ డాన్స్ ! - MicTv.in - Telugu News
mictv telugu

డాన్స్ డాన్స్ భళారే డాన్స్ డాన్స్ !

August 12, 2017

సినిమాల్లో నవరసాలూ వుంటాయి. ఆ నవరసాలతో పాటు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసేది ఆ సినిమాలో వచ్చే డాన్సే. సోలో డాన్స్ అయినా, జంటగా చేసే డాన్స్ అయినా ఆ కాసేపు సినిమా చూస్తున్న ప్రేక్షకులకు బాడీలో వూపునిచ్చేది డాన్సే. మనకు డాన్స్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు మైఖేల్ జాక్సన్. తను డాన్స్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్లు చూస్తే తన బాడీలో రబ్బరు ఎముకలు ఉన్నాయా అన్నంత మెస్మరైజింగ్ కలుగుతుంది.
అతని బ్రేక్ డాన్సుకు ప్రపంచం యావత్తు మంత్ర ముగ్దులయ్యారు. మైఖేల్ జాక్సన్ భౌతికంగా పోయినా అతని డాన్స్ మాత్రం అలా ప్రేక్షకుల మదిలో నిలిచే వుంది. లేటెస్టుగా గంగ్నమ్ డాన్స్ కూడా ఎంత ఫేమస్సైందో మనందరికీ ఎరుకున్న ముచ్చటే.

అయితే ఈ డాన్స్ అనేది మనిషి బాడీలో సర్వ సాధారణంగా వుండే మూమెంటే. హ్యాప్పీ మూడ్ లో వున్నప్పుడు పక్కనుండి ఏదైనా హమ్మింగ్ మ్యూజిక్ వస్తుంటే ఆటోమెటిగ్గా కాలూ, చెయ్యి ఆడటం సహజం. పెళ్లిళ్ళు, పేరంటాళ్ళో ఖుషీ మూడ్ లో వుండి తీన్మార్ స్టెప్పులేస్తుంటారు. ఆనందానికి ఒక ఊపునిచ్చేది డాన్స్ అనొచ్చు. డాన్స్ చేస్తే బాడీకి మంచి ఎక్సర్ సైజ్ కూడా అవుతుందనేది శాస్త్రీయంగా రుజువైంది. ఏ కళైనా మనుషుల సహజ జీవనంలోంచే వచ్చింది. అలాగే ఈ డాన్స్ కూడా మనుషుల జీవనం నుండే వచ్చిందని చెప్పుకోవచ్చు.

డాన్స్ సినిమాలో భాగం

బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుండే సినిమాల్లో డాన్స్ ఒక ప్రాధాన్యతను సంతరించుకుంటూ వచ్చింది. జానపద కళా నృత్యాలు, సాంప్రదాయ నృత్యాల నుండి బ్రేక్ డాన్సులు, బెల్లీ డాన్సుల వరకు వరకు కొనసాగింది డాన్సుల ప్రహసనం. పల్లెల్లో ప్రజలు పొద్దస్తమానం పనులు చేస్కొని రాత్రుళ్ళు ఇళ్ళ దగ్గర టైంపాస్ కోసం డాన్సును ఎంచుకునేవారు. నాచురల్ గా వాళ్ళ నోటి నుండి వచ్చే జానపదాలకు తమకు వచ్చినట్టుగా డాన్స్ చేసేవారు. అలా వివిధ తెగలకు సంబంధించి కూడా ప్రత్యేక నత్యాలున్నాయి.భరత నాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సి, మోహినీఆట్టం, పేరిణి వంటి.., చాలా సాంప్రదాయ నృత్యాలు బహుళ ప్రజాదరణ పొందాయి. సినిమాల్లో, స్టేజ్ షోలల్లో ఈ నృత్యాలు ప్రదర్శించబడ్డాయి. ఆయా దేశాలు, రాష్ట్రాల ప్రజల జీవన విధానంలోంచి నృత్యాలు పుట్టుకొచ్చాయి. అలా జానపదా కళా నృత్యాలుగా, తర్వాత సాంప్రదాయ కళా నృత్యాలుగా ప్రఖ్యాతి గాంచినవి.

మన తెలుగు సినిమాలు చాలా వరకు డాన్సు ప్రాధాన్యతతో వచ్చాయి. వాటిల్లో కె. విశ్వనాథ్ తీసిన శంకరాభరణం, సిరిసిరి మువ్వ, సాగర సంగమం, స్వర్ణ కమలం వంటి సినిమాలు చక్కటి ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రాల్లో మంజు భార్గవి, భానుప్రియ, జయప్రదల నాట్యం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచివున్నాయి. అవి ఎప్పటికీ చెరిగిపోనివి కూడా. డాన్స్ యొక్క ప్రాముఖ్యతను దశదిశలు చాటిన గొప్ప సినిమాలివి. వివిధ భాషల్లో కూడా నిర్మితమై విశేష ప్రేక్షకాదరణ పొందాయి.

సిరిసిరిమువ్వ

శ్రీశ్రీ రాసిన సిరిసిరిమువ్వ శతకానికి ఇన్స్పిరేషన్ గా వచ్చిన ఈ సినిమా గొప్ప వసూళ్ళను సాధించింది. 1976 లో వచ్చిన ఈ సినిమాలో పల్లెటూరి మూగ పిల్లకు నాట్యమంటే ఎనలేని ప్రేమ వుంటుంది. కానీ సవతి తల్లి అందుకు సహకరించదు. సాంబయ్య సహకారంతో గొప్ప నర్తకిగా పేరు తెచ్చుకుంటుంది. ఇదీ టూకీగా సినిమా కథ. సంగీతం మిళితమైన నృత్యం మరింత రక్తి కడుతుందనడానికి ఈ సినిమాలోని ‘ ఝుమ్మంది నాదం సయ్యంది పాదం ’ పాటే ఎగ్జాంపుల్. జయప్రద, కవితల పర్ ఫార్మెన్స్ అద్భుతంగా వుంటుంది.

శంకరా భరణం

1979 లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్ గా నిలచిపోయింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. శంకర శాస్త్రిగా సోమయాజులు సంగీత విధ్వాంసుడిగా నటించాడు. అతని దగ్గర వేశ్య కూతురు సంగీతం నేర్చుకోవాలనుకుంటుంది. కానీ ఆమె తల్లి అందుకు నిరాకరిస్తుంది. శంకర శాస్త్రి ఆదరణతో నేర్చుకుంటుంది. మంజుభార్గవి ప్రదర్శించిన నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటుంది.

సాగర సంగమం

1983 లో విడుదలైన ఈ సినిమా నృత్య ప్రధానంగా రికార్డులు తిరగరాసింది. కమల్ హాసన్, జయప్రద, శైలజలు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ తకిట తధమి తకిట తధిమి తందాన ’ అనే పాట ఎంత పాప్యులర్ అయిందో మనకు తెల్సిందే. కూచిపూడి, కథక్, భరత నాట్యంలలో ప్రావీణ్యుడైన కమల్ హాసన్ సినిమా ఇండస్ట్రీలో ఇమడలేక పోతాడు. అప్పుడు జయప్రద అతనికి అండగా నిలబడుతుంది. ఆమెని ప్రేమించి కూడని పరిస్థితుల్లో ఆమె ప్రేమను వదులుకుంటాడు. తర్వాత తనకు వేరే అతనితో పెళ్లవుతుంది. అటుపై ఆమె కూతురికే గురువౌతాడు. చివరికి అతని మరణంతో సినిమా ముగుస్తుంది. ఎన్నో అవార్డులను సొంతం చేస్కుంది కూడా.

స్వర్ణ కమలం

ఇది కూడా కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన క్లాసిక్ ఫిల్మ్. భానుప్రియ ఈ సినిమా ద్వారా మంచి నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్నది. ‘ ఆకాశంలో ఆశల హరివిల్లు ’ అనే పాటలో భానుప్రియ చేసిన కూచిపూడి డాన్స్ పర్ ఫార్మెన్స్ అద్భుతంగా వుంటుంది. వెంకటేష్ హీరోగా నటించాడు. కూచిపూడి నాట్యకారిణికి, చిత్రకారుడికి మధ్య నడిచే కథ.

ఇలా కొన్ని సినిమాలు డాన్స్ ఇతివృత్తంతో వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి. రాఘవ లారెన్స్ తీసిన ‘ స్టైల్ ’ సినిమా కూడా మంచి సినిమాగా ఆడియన్సును ఆకట్టుకుంది. అలాగే ప్రభుదేవా అప్పట్లో తీసిన ‘ స్పీడ్ డాన్సర్ ’ ఈ మధ్య హిందీలో తీసిన ‘ ఎబిసిడి ’ సినిమాలు కూడా మంచి కలెక్షన్లు రాబట్టాయి. ప్రభుదేవా, లారెన్స్ లు మంచి డాన్సర్స్ గా తమ ముద్ర వేసారు. ఐటం సాంగుల పేరిట కొంత కాలం నుండి డాన్సులను అశ్లీలానికి దగ్గర చేసారు. జయమాలిని, జ్యోతిలక్ష్మి, డిస్కోశాంతి, సిల్క్ స్మిత, అనురాధ.., వంటి కొందరు ఆక్ట్రెసెస్ ఐటం గర్ల్స్ గా ముద్రపడి సినిమాల్లో తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఆ ట్రెండు కంటిన్యూ అవుతోంది.

ఇప్పుడు ఫ్రెష్ గా హీరోయిన్లు కూడా ఐటం సాంగులు చెయ్యటం పరిపాటైంది. హంసానందిని, ముమైత్ ఖాన్, అభినయశ్రీ, తమన్నా, కాజల్, అల్ఫాన్సా మొదలగువారు. ఇప్పుడున్న హీరోయిన్లలో తమన్నా, అనుష్కలు క్లాసికల్ డాన్స్ చేస్తుండటం విశేషం. ఇక హీరోల సంగతి తీస్కుంటే చిరంజీవి, రాధ ఇద్దరిదీ మంచి హిట్ పెయిర్. వీరిద్దరు బ్రేక్ డాన్సులో చక్కటి ప్రదర్శన చేసేవారు. చిరంజీవి మంచి నటుడే కాదు మంచి డాన్సర్ అని ప్రఖ్యాతి గాంచి ఇప్పుడొస్తున్న ఎందరో హీరోలకు స్ఫూర్తిగా నిలిచాడు.

పేరిణి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూచిపూడి నృత్యం రాష్ట్ర నృత్యంగా వుండింది. ఇది కృష్ణా జిల్లాలోని దివి తాలుకాకు చెందిన కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించిన భారతీయ నాట్యమిది. కానీ తెలంగాణాకు తొలుత నుండీ ఒక ప్రత్యేక నృత్య కళ వుంది. అది రాష్ట్రం విడివడ్డాక పేరిణీని రాష్ట్ర నృత్యంగా నిలబెట్టడానికి తెలంగాణ సర్కార్ గట్టి ప్రయత్నం చేస్తోంది. శాస్త్రీయ ఆధారాలను బట్టి చూస్తే దీన్ని పేరిణీ శివతాండవం అని కూడా అంటారు. ఇది కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన డాన్స్. కానీ దీనికి లాస్యాన్ని జోడించి స్త్రీనృత్యాన్ని కూడా పేరిణీలోకి ఇనువడింప జేస్తున్నారు.

పూర్వకాలంలో యుద్ధానికి బయలుదేరే ముందు పరమ శివుడి ముందు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నాట్యాన్ని ప్రదర్శించేవారు. ఓరుగల్లును ఏలిన కాకతీయల కాలంలో ఈ నృత్యం బాగా ప్రఖ్యాతి గాంచింది. ఈ కళకు సంబంధించిన ఆనవాలు ఓరుగల్లు సమీపంలోని రామప్ప దేవాలయం శిల్ప కళల్లో చూస్తే తెలుస్తుంది. కాకతీయలు అనంతరం ఈ కళ దాదాపుగా సమసిపోయింది. కానీ మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహుడిగా పిలవబడే నటరాజ రామకృష్ణ కృషితో పేరిణీ వెలుగులోకొచ్చింది. ఈ నృత్యాన్ని తెలంగాణా రాష్ట్ర నృత్యంగా వెలుగులోకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నాట్యం మీద పూర్తి నిడివి గల ఒక క్లాసిక్ సినిమా రావాలి. అప్పుడే ఇంపాక్ట్ చాలా వుంటుందేమో.

సినిమాల్లో పాటలు వుంటే తప్పకుండా డాన్స్ వుండాల్సిందే. ఇవి రెండూ మిక్స్ అయితే చక్కటి ఫ్లేవర్ తో ప్రేక్షకులకు ఫుల్లు ఎంటర్ టైన్ మెంటే. అయితే కొసమెరుపు ఏమిటంటే ఇప్పుడున్న ఫ్రెష్ డైరెక్టర్లు క్లాసిక్ డాన్స్ నేపథ్యంలో సినిమాలను తియ్యటం లేదు.

– సంఘీర్