భ‌ర‌త్ రాజ‌కీయ ప్ర‌సంగం - MicTv.in - Telugu News
mictv telugu

భ‌ర‌త్ రాజ‌కీయ ప్ర‌సంగం

April 20, 2018

పూర్తిస్థాయి రాజ‌కీయ క‌థాంశంతో తెలుగులో సినిమా వ‌చ్చి చాలా కాల‌మే అయింది.  ఈ త‌ర‌హా చిత్రాల్లో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు తావు లేక‌పోవ‌డం, సున్నిత‌మైన‌ క‌థాంశాలు కావ‌డం, రాజ‌కీయాల  ప‌ట్ల ద‌ర్శ‌కుల‌కు ఉన్న అవ‌గాహ‌న‌లేమి కారణంగా స‌మ‌కాలీన హీరోలంతా వీటికి దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఇలాంటి త‌రుణంలో భ‌ర‌త్ అనే నేను సినిమాతో మ‌హేష్‌బాబు రాజ‌కీయ క‌థ‌ను ఎంచుకోవ‌డం అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది. మ‌రో అడుగు ముందుకు వేసి ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర‌లో క‌నిపించారు మ‌హేష్‌. కెరీర్ తొలినాళ్ల నుంచి సామాజిక ఇతివృత్తాల‌కు వాణిజ్య విలువ‌ల‌ను జోడించి వ‌రుస విజ‌యాల్ని అందుకుంటున్న కొర‌టాల శివ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.    శ్రీ‌మంతుడు త‌ర్వాత మ‌హేష్‌బాబు, కొర‌టాల శివ క‌ల‌యిక‌లో రూపొందిన ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

వ‌ర‌ద‌రాజు(ప్ర‌కాష్‌రాజ్‌), రాఘ‌వ‌రాజు(శ‌ర‌త్‌కుమార్‌) ఇద్ద‌రు ప్రాణ స్నేహితులు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌న్న ఆలోచ‌న‌తో న‌వ‌లోకం పేరుతో రాజ‌కీయ పార్టీని పెడ‌తారు. ప్ర‌జా నాయ‌కుడిగా పేరుతెచ్చుకున్న  రాఘ‌వ‌రాజు ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రి అవుతాడు. వ‌ర‌ద‌రాజు స‌హాయంలో ప‌రిపాల‌న కొన‌సాగిస్తుంటాడు. ఇంత‌లో అనారోగ్యం కార‌ణంగా రాఘ‌వ‌రాజు మ‌ర‌ణించ‌డంతో అత‌డి స్థానంలో విదేశాల్లో చ‌దువుతున్న ఆయ‌న కొడుకు భ‌ర‌త్‌రామ్(మ‌హేష్‌బాబు) ముఖ్య‌మంత్రి అవుతాడు.  రాజ‌కీయాలు, రాష్ట్రంపై అవ‌గాహ‌న లేని భ‌ర‌త్‌రామ్ త‌న నిజాయితీ, ధైర్యంతో కొద్ది రోజుల్లోనే ప్ర‌జ‌ల్లో మంచి పేరు తెచ్చుకుంటాడు. అత‌డు చేస్తున్న ప‌నుల‌ను స‌హించ‌లేని త‌మ పార్టీ నాయ‌కులే భ‌ర‌త్‌రామ్‌కు అడ్డంకుల‌ను సృష్టిస్తుంటారు. వ‌సుమ‌తి(కియారా అద్వానీ) ప్రేమ‌ను అడ్డు పెట్టుకొని అత‌డిని ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి దూరం చేస్తారు. కానీ  త‌మ బాగోగుల కోసం నిజాయితీగా పాటుప‌డిన భ‌ర‌త్‌రామ్ తిరిగి ముఖ్య‌మంత్రి ప‌దవి చెపట్టాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటారు. వారు ఆశించిన‌ట్లుగానే భ‌ర‌త్‌రామ్ తిరిగి ముఖ్య‌మంత్రి కాగ‌లిగాడా? త‌న తండ్రి ఆశ‌యాల్ని నేర‌వేర్చ‌గ‌లిగాడా? ప్రాణ మిత్రుడుగా ఉంటూనే రాఘ‌వ‌రాజును వ‌ర‌ద‌రాజు ఎందుకు చంపించాడు. త‌న తండ్రి మ‌ర‌ణానికి భ‌ర‌త్‌రామ్ ఎలా బ‌దులు తీర్చుకున్నాడ‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

నాయ‌కుడే అవ‌స‌రం లేని న‌వ స‌మాజ నిర్మాణం కోసం పాటుప‌డిన న‌వ‌త‌రం ముఖ్య‌మంత్రి క‌థ ఇది. ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌లు తీరాలంటే వారి చేతుల్లోనే అధికారం ఉండాల‌ని, స్వ‌యం ప‌రిపాలన వ‌ల్లే గ్రామాలు అభివృద్ధిలోకి వ‌స్తాయ‌నే అంశాన్ని ద‌ర్శ‌కుడు  కొర‌టాల శివ సందేశాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించారు. రాజ‌కీయ చద‌రంగంలో నాయ‌కుల మ‌ధ్య లోపాయ‌కారిగా ఉండే ఒప్పందాల్ని, స‌క్ర‌మంగా త‌మ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్న అధికారుల‌ను నాయ‌కుల నుంచి ఎదుర‌య్యే ఒత్తిడుల‌ను ఆవిష్క‌రించారు. అలాగే ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌ల్ని  చేప‌ట్ట‌డం సుల‌భం కాద‌ని, సొంత పార్టీ, ప్ర‌తిప‌క్షంతో పాటు ప్ర‌జ‌లు అంద‌రిని మెప్పిస్తూ ప‌రిపాల‌న చేయ‌డం క‌త్తిమీద సాములాంటి వ్య‌వ‌హ‌ర‌మ‌నే పాయింట్‌ను క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌పై చ‌ర్చించారు. రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో ప‌డి వ్య‌క్తిగ‌త జీవితానికి, కుటుంబానికి స‌మ‌యాన్ని కేటాయించ‌లేక నాయ‌కులు, వారి పిల్ల‌లు ప‌డే సంఘ‌ర్ష‌ణ‌ను క‌థ‌లో అంత‌ర్లీనంగా చూపించారు. ఇలా సినిమాలో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు.

భ‌ర‌త్ అనే నేను ద్వారా కొర‌టాల శివ చెప్పాల‌నుకున్న పాయింట్ మంచిదే అయినా దానిని చెప్పిన తీరు కొంత గంద‌ర‌గోళానికి గురిచేసింది.  రాజ‌కీయం, కుటుంబ బంధాలు, ప్రేమక‌థ ఇలా చాలా అంశాల్ని తీసుకోవ‌డంతో దేనికి పూర్తిగా న్యాయం చేయ‌లేక‌పోయారు. అన్నింటిని పైపైన ప్ర‌స్తావిస్తూ  పోయిన అనుభూతి క‌లుగుతుంది. మ‌హేష్‌భాబు ముఖ్య‌మంత్రి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అత‌డికి ఎదుర‌య్యే స‌వాళ్ల‌లో ఆస‌క్తి లోపించింది. ట్రాఫిక్‌, స్కూల్ ఫీజులు వంటి చిన్న చిన్న అంశాల‌తో క‌థ‌ను న‌డిపించారు. ఆ అంశాల‌ను స్పీచ్‌ల రూపంలో చెప్ప‌డంతో వాటిలో ఆస‌క్తి కొర‌వ‌డింది.

ప్ర‌థ‌మార్థం మొత్తం మ‌హేష్‌బాబు తీసుకునే నిర్ణ‌యాలు, అత‌డికి ఎదుర‌య్యే అడ్డంకుల‌తో క‌థ‌ను న‌డిపించిన కొర‌టాల శివ ద్వితీయార్థంలో  అదే పంథాను అనుస‌రించారు. దాంతో చూసిన స‌న్నివేశాలే మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్న అనుభూతి క‌లుగుతుంది. స్టూడెంట్‌తో ముఖ్య‌మంత్రి రాస‌లీల‌లు అంటూ క‌థ‌ను మ‌లుపుతిప్పిన ద‌ర్శ‌కుడు అక్క‌డ నుంచి తండ్రిది హ‌త్య అంటూ ప్ర‌తీకార డ్రామాను జోడించాడు. అయితే అప్ప‌టికే ప‌రిస్థితి చేయి దాటిపోవ‌డంతో ఆ స‌న్నివేశాలు సినిమాను నిల‌బెట్ట‌లేక‌పోయాయి.  ఆ చిక్కుముడిని చాలా సుల‌భంగా వీడేలా చేశారు. అక్క‌డితోనే ముగింపు ఏమిటో అర్థ‌మైపోతుంది. రొటీన్ క్లైమాక్స్‌తో సినిమాను ముగించేశారు.

లీడ‌ర్‌, ఒకే ఒక్క‌డు, ప్ర‌స్థానం ఇలా  రాజ‌కీయ అంశాల‌తో తెలుగుతెర‌పై గ‌తంలో వ‌చ్చిన చాలా సినిమా ఛాయ‌లు ఇందులో క‌నిపిస్తాయి.  క‌థ సాగుతున్నా అందులో ఏ ఎమోష‌న్‌తో ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ కాలేడు. సందేశం స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు.  రాజకీయాల్ని ప‌క్క‌న‌పెడితే వ‌సుమ‌తి, భ‌ర‌త్‌రామ్ ప్రేమాయ‌ణం, కుటుంబ అనుబంధాల‌ను స‌రిగా రాసుకోలేని భావ‌న క‌లుగుతుంది. కొర‌టాల శివ గ‌త సినిమాల‌తో పోలిస్తే క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా చాలా బ‌ల‌హీనంగా ఉన్న సినిమా ఇదేన‌నే అనుభూతి క‌ల‌గ‌క‌మాన‌వు. రాజ‌కీయ క‌థాంశాల‌కు సంభాష‌ణ‌లు ప్ర‌ధాన బ‌లం. ప్రేక్ష‌కుల్ని ఆలోచించ‌జేసే ఒక్క డైలాగ్ ఈ సినిమాలో క‌నిపించ‌దు.

కొర‌టాల శివ సిద్ధం చేసుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా త‌ను చెప్పాల‌నుకున్న పాయింట్‌ను నిజాయితీగా ఆవిష్క‌రించిన తీరు బాగుంది. క‌థ‌కు సంబంధంలేని అన‌వ‌స‌ర‌పు కామెడీ ట్రాక్‌లు, ప్ర‌త్యేక గీతాల‌కు ఈ సినిమాలో తావులేకుండా చూసుకున్నారు. ముఖ్య‌మంత్రిగా మ‌హేష్‌బాబు న‌ట‌న, పాత్ర చిత్ర‌ణ స‌రికొత్త‌గా ఉన్నాయి. త‌న శైలికి భిన్నంగా  ఆద్యంతం హుందాత‌నంతో ఆయ‌న పాత్ర తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు. ఎక్క‌డ హ‌ద్దులు దాట‌కుండా ప‌రిణ‌తితో కూడిన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారాయ‌న‌. న‌ట‌న‌, సంభాష‌ణ‌లు చెప్పే తీరు అన్నింటిలో వైవిధ్య‌త క‌పినిస్తుంది. సీరియ‌స్ కోణంలో సాగుతూనే త‌న న‌ట‌న‌తో అక్క‌డ‌క్క‌డ న‌వ్వించారు. న‌టుడిగా అత‌డి కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుంది. ఈ సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అరంగేట్రం చేసింది బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ.

రాజ‌కీయ అంశాల‌తో సాగే సినిమా కావ‌డం, ప్రేమ‌క‌థ‌కు త‌క్కువ ఆస్కారం ఉండ‌టంతో ఆమె ఎక్కువ‌గా సినిమాలో క‌నిపించ‌లేదు. త‌న‌ ప‌రిధుల మేర ప‌ర్వ‌లేదనిపించింది. పాట‌ల్లో గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటుంది. పైకి మంచివాడిగా చెలామ‌ణీ అయ్యే అవినీతి ప‌రుడైన రాజ‌కీయ నాయ‌కుడిగా ప్ర‌కాష్‌రాజ్ త‌న‌కు అల‌వాటైన పాత్ర‌లో మ‌రోసారి క‌నిపించారు. రావుర‌మేష్, నెపోలియ‌న్‌, ర‌విశంక‌ర్‌, అజ‌య్‌, సితారా ఇలా చాలా మంది అనుభ‌వ‌జ్ఞులైన న‌టీన‌టులు సినిమాలో ఉన్నా ఎవ‌రి పాత్ర‌ల‌కు ప్రాముఖ్య‌త లేదు.

దేవిశ్రీ‌ప్ర‌సాద్ బాణీల్లో టైటిల్ సాంగ్ త‌ప్ప మిగితావి పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. నేప‌థ్య సంగీతం ఓకే అనిపించింది. ఛాయాగ్ర‌హ‌కులు తిరునావుక్క‌ర‌సు, ర‌వి కె చంద్ర‌న్ పాట‌ల‌ను అందంగా తెర‌కెక్కించారు. అసెంబ్లీ సెట్‌, వ‌చ్చ‌డ‌య్యా స్వామీ పాట కోసం వేసిన టెంపుల్ సెట్ స‌హ‌జంగా బాగున్నాయి. డీవీవీ దాన‌య్య ప్ర‌తి చోట కావాల్సిన దానికంటే ఓ రూపాయి ఎక్కువ‌గానే ఖ‌ర్చుపెట్టి ఈసినిమాను తెర‌కెక్కించారు.

రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పోలిస్తే భిన్న‌మైన అనుభూతిని పంచే చిత్ర‌మిది. స్టార్ హీరోతో రాజ‌కీయ క‌థాంశాన్ని వాణిజ్య సూత్రాల‌కు అనుగుణంగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ సినిమా ద్వారా ఆవిష్క‌రించారు. అయితే సుదీర్ఘ‌మైర రాజ‌కీయ ప్ర‌సంగంలా ఈ సినిమా సాగ‌డం కొంత మైన‌స్‌గా మారింది. సందేశాత్మ‌క క‌థాంశంతో మంచి సినిమాగా నిల‌వాల్సిన ఈ చిత్రం వివాదాల‌కు తావు ఉండ‌కూడ‌ద‌నే ద‌ర్శ‌కుడి అతి జాగ్ర‌త్త‌ల కార‌ణంగా స‌గ‌టు చిత్రంగా మిగిలింది.  పోటీగా స‌రైన సినిమాలు లేక‌పోవ‌డం, వేస‌వి సెల‌వులు ఈ సినిమా ఫ‌లితాన్ని ఏ మేర‌కు ప్ర‌భావితం చేస్తాయో చూడాలి.

రేటింగ్‌:2.5/5