ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్, మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంఘాలు దేశ ప్రజలకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశాయి. ఈ నెల 25న దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నామని ప్రకటించాయి. బహుజన్ ముక్తి పార్టీ షహరాన్పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధిమాన్ మీడియాతో మాట్లాడుతూ..” కేంద్ర ప్రభుత్వం కుల ఆధారిత ఓబీసీ జనగణనను నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తుంది. కావున దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలకు సంబంధించి తక్షణమే కేంద్రం జనగణనను చేపట్టాలని డిమాండ్ చేస్తూ, మే 25న భారత్ బంద్కు పిలుపునిచ్చాం. కేంద్రం కులాల ఆధారంగా ఓబీసీ జనాభా గణన చేపట్టకపోవడం, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, ఎన్నికల్లో ఈవీఎంల కుంభకోణం వంటి అంశాలకు నిరనగా ఈ భారత్ బంద్ చేపడుతున్నాం” అని ఆయన అన్నారు.
అనంతరం రైతులకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చేలా చట్టం చేయడం, పాత పెన్షన్ విధానం అమలు చేయడం, ఎన్ఆర్సీ, సీఎఎ, ఎన్పీఆర్ ఉపసంహరణ, మధ్యప్రదేశ్, ఒడిశాలో పంచాయితీ ఎన్నికలలో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం వంటి డిమాండ్లతో పాటు వ్యాక్సిన్లపై బలవంతపు ఒత్తిడికి వ్యతిరేకంగా బంద్ చేపట్టనున్నట్లు ఫెడరేషన్ నేతలు పేర్కొన్నారు. కాగా, మే 25న భారత్ బంద్ సందర్భంగా వ్యాపారాలు, ప్రజా రవాణాను మూసివేయాలని ఫెడరేషన్ సభ్యులు కోరారు.
మరోపక్క గత కొన్ని రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ..”దేశంలో పదేళ్లకోసారి నిర్వహించే జనగణన 2024 తర్వాత ఉండదు. 2024 తర్వాత జనగణనను ప్రత్యేకించి చేపట్టాల్సిన అవసరం లేదు. జనన, మరణ రిజిస్టర్ల రేటును జనగణనకు జత చేస్తామని, 2024లోగా ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాటును పూర్తి చేస్తాం” అని ఆయన అస్సాం పర్యటనలో చెప్పారు.