దేశవ్యాప్తంగా సోమవారం, మంగళవారం రెండు రోజులపాటు భారత్ బంద్‌ను ప్రకటించినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. బంద్‌లో భాగంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ జాతీయ యూనియన్లతోపాటు, రాష్ట్రాల్లోని సంఘాలు పాల్గొననున్నాయి. అయితే, ఈ బంద్‌కు ప్రధానం కారణం.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. కావున సోమవారం (ఈరోజు), మంగళవారం (రేపు) భారత్ బంద్ జరగనున్నట్లు పేర్కొన్నాయి.
మరోపక్క ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టంలో మార్పులకు నిరసనగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు రెండు రోజులపాటు సమ్మె చేయనున్నాయి. అంతేకాకుండా సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాలన్నీ ప్రభావితం కానున్నాయి. కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా సుమారు 60 లక్షల మంది కార్మికులు పనులను బహిష్కరించనున్నట్లు రైల్వే యూనియన్ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా అన్ని వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ, సహకార బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి.