ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. కరోనా నాజల్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 18 ఏళ్లు పై బడిన వారికి ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌కు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోవిన్ యాప్‌లో నాజల్ టీకాను చేర్చనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రకటించారు. దీన్ని బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చని, ముందుగా ఇవి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగితే దానికి ముందస్తు సన్నద్ధతగా.. దేశంలోని ఆస్పత్రిల్లో డిసెంబర్ 27న మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి.
కరోనా నాజల్ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించింది. కోవిన్ యాప్‌లో దీన్ని యాడ్ చేయడంతో ఎవరైనా తీసుకునేందుకు వీలుంటుంది. టీకా సర్టిఫికేషన్ కూడా యాప్ నుంచి తీసుకోవడం సులభమవుతుంది. కరోనా మొదటి రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోస్ కు అర్హులు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ తీసుకున్న వారు అవే కంపెనీ బూస్టర్ టీకాలు తీసుకోవచ్చు. వాటికి బదులు నాజల్ టీకాను కూడా తీసుకోవచ్చు. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనాకు కోవాగ్జిన్, కోవిషీల్డ్, కోవోవ్యాక్స్, స్పుత్నిక్ వీ, బయోలాజికల్ ఈ కార్బోవ్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. కొవిడ్ పరిస్థితులపై నేడు కూడా అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి సమావేశం కానున్నారు.