మాల్దీవులకు భారత్ అండ.. రూ.1,840 కోట్ల సాయం - MicTv.in - Telugu News
mictv telugu

మాల్దీవులకు భారత్ అండ.. రూ.1,840 కోట్ల సాయం

September 20, 2020

nvgnh

కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా తలకిందులైంది. సజావుగా సాగుతున్న వ్యవస్థను కుండ బోర్లించినంత పనిచేసింది కరోనా వైరస్. ఈ నేపథ్యంలో ఒక దేశానికి ఇంకొక దేశం వెన్నుదన్నుగా నిలవాల్సిన సమయం ఇదే. కష్టాల్లో ఉన్న దేశాలను ఇతర దేశాలు ఆదుకుంటేనే భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మాల్దీవుల దేశానికి భారత్ రూ.1,840 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. ఆ దేశ రాజధాని మాలేలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాల్దీవులలోని భారత రాయబార కార్యాలయం అధికారులు 250 మిలియన్ అమెరికా డాలర్ల చెక్కును ఆ దేశ అధికారులకు అందించారు. 

కరోనా కష్టకాలంలో భారత్ చేసిన ఆర్థిక సహాయం పట్ల ఆ దేశ పాలకులు, అధికారులు భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఇలాంటి చర్యలు ఎంతో ఉపయుక్తం అవుతాయని అన్నారు. కాగా, పర్యాటకంపై ఆధారపడే ఆ దేశం కరోనా నేపథ్యంలో ఆర్థికంగా బాగా చితికిపోయింది. దీంతో భారత్ స్పందించి ఈ సాయం చేసింది. మాల్దీవుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9 వేలు దాటింది. 30 మందికి పైగా కరోనాకు బలయ్యారు.