భారత్? ఇండియా?: సుప్రీం జోక్యం చేసుకోదు.. కేంద్రమే డిసైడ్ చేస్తుంది - MicTv.in - Telugu News
mictv telugu

భారత్? ఇండియా?: సుప్రీం జోక్యం చేసుకోదు.. కేంద్రమే డిసైడ్ చేస్తుంది

June 3, 2020

Namaha India.

ఇండియా పేరును భార‌త్‌గా మార్చాల‌న్న పిటిష‌న్‌ను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని.. ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రానికి పంపుకోవచ్చని తెలిపింది. ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త న‌మ‌హా ఇండియా పేరును భార‌త్ లేదా హిందుస్తాన్‌గా మార్చాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగతి తెలిసిందే.‌ పేరు మార్పుతో మన జాతీయతపై గర్వంగా ఫీలవ్వొచ్చని, పరాయి పాలనను పౌరులు మరిచిపోయేలా చేస్తుందని పేర్కొన్నారు. ‘ఇండియా’ అనే పదం గ్రీకు నుంచి ఉద్భ‌వించింద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ పేరు తొల‌గించ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్ త‌రాలు గ‌ర్వపడతాయని చెప్పారు. 

మరోవైపు దేశ చ‌రిత్ర‌లోనూ ‘భార‌త్ మాతాకీ జై’ అనే నినాదాలు ఉన్నాయ‌న్నారు. ఇండియా అనే పేరును తొల‌గించ‌డం వ‌ల్ల విముక్తి సాధించిన‌వాళ్ల‌మ‌వుతాం అని వాదించారు. బుధ‌వారం దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం ఇండియాను ఇప్ప‌టికే భార‌త్ అని పిలుస్తున్నార‌ని తెలిపింది. అయినా ఈ విష‌యంలో తాము క‌ల్పించుకోలేమ‌ని తేల్చిచెప్పింది. పేరు మార్పునకు సంబంధించి పిటిష‌న్ కాపీ మంత్రిత్వ శాఖ‌కు ఇవ్వాల‌ని సూచించింది. అప్పుడు ప్ర‌భుత్వమే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటుందని తెలిపింది. కాగా, 2016లో కూడా ఇండియా పేరు మార్చాలంటూ పిటిష‌న్ దాఖల‌వ‌గా.. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది.