‘దొరల రాజ్యం’  బలుపు రెడ్డి లొంగుబాటు - MicTv.in - Telugu News
mictv telugu

‘దొరల రాజ్యం’  బలుపు రెడ్డి లొంగుబాటు

December 11, 2017

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో దళితులపై అమానుషంగా దాడిచేసిన బీజేపీ నేత భరత్‌ రెడ్డిని జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. దాడి చేసిన తర్వాత పత్తా లేకుండా పోయిన రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో పోలీసుల వద్ద లొంగిపోయాడు.  విచారణ కోసం నిజామాబాద్‌ తరలించారు. అరెస్టును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

భరత్ రెడ్డి చేసిన దాడిపై తీవ్ర నిరసన వ్యక్తం కావడం తెలిసిందే. అభంగపట్నం వద్ద చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలించడాన్ని రాజేశ్, లక్ష్మణ్ అనే యువకులు అడ్డుకోవడంతో రెడ్డి వారిపై దాడి చేశాడు. బండబూతులు తిడుతూ కర్రతో కొట్టి, నీటిలో మునక వేయించి, ముక్కను నేలకు రాయించాడు. ఈ వీడియో వైరల్ అయింది. రెడ్డి.. బాధితులను కిడ్నాప్ చేసి హైదరాబాద్‌లో బంధించాడు. నిరసనలు పెరగడంతో వారికి మీడియా ముందుకు పంపించాడు. తమపై జరిగింది దాడికాదని, ‘దొరల రాజ్యం’ సినిమా షూటింగ్‌లో భాగంగా అలా నటించామని ఇద్దరు యువకులు చెప్పారు.అయితే ఊరికి వెళ్లాక నిజం చెప్పారు. అది షూటింగ్ కాదు, దాడేనని అన్నారు. రెడ్డి తమను, తమ కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడని, ప్రాణాలు కాపాడుకోవడానికే షూటింగ్ కథ చెప్పామని తెలిపారు.  దీంతో పోలీసులు రెడ్డిపై ఎస్‌సిఎస్టీ అట్రాసిటీ,  కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కాగా, తనపై అక్రమ కేసులు బనాయించారని భరత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. తనను అణగదొక్కే రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని చెప్పుకొస్తున్నాడు. వీడియో  షార్ట్‌ఫిల్మ్‌లో భాగమేనని, న్యాయపోరాటం చేస్తానని అంటున్నాడు.

BJP leader Bharat Reddy surrendered to police for attack on dalits in Abhangapatnam