నిత్యం హరినామ స్మరణతో కిటకిటలాడే తిరుమలలో జరక్కూడని ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు హత్యకు గురయ్యాడు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరుగగా, నిందితుడు హతుడిని బండరాయితో మోది హత్య చేశాడు. శ్రీవారి ఆలయం వెనుక ఉన్న గోవింద నిలయం వద్ద మృతదేహం కనిపించగా, పోలీసులు వెంటనే సీసీ కెమెరాల్లో చెక్ చేశారు. అందులో హత్య జరిగిన సంఘటన రికార్డయింది. దీంతో నిందితుడు కంద స్వామిని పోలీసులు రెండు గంటల వ్యవధిలో పట్టుకున్నారు. కాగా, మృతుడిని తమిళనాడుకు చెందిన భాస్కర్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.