పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా సినిమా ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి తన మనసు సహకరించటం లేదంటూ.. సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందువల్లనే భీమ్లా నాయక్ వేడుకను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తన మనసుని కలచివేసింది. ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే సోమవారం జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది” అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.