ఆసియాలోనే అతి పొడవైన దంతాలు ఉన్న ఏనుగుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన భోగేశ్వర్ అనే మగ ఏనుగు అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో పులులను చూడడానికి వచ్చే పర్యాటకులకు తన పొడవైన దంతాలతో ఠీవిగా కనిపిస్తూ.. పర్యాటకులను అలరించేది. ఈ భోగేశ్వర్ అంటే పర్యాటకులకు చాలా చాలా ఇష్టం.
60 ఏళ్ళు వయస్సు ఉన్న భోగేశ్వర్… వయస్సు రీత్యా తలెత్తిన ఆరోగ్య సమస్యలతోనే మృతి చెందినట్టు బందీపూర్ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ రమేష్ కుమార్ మీడియాకు తెలిపారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో భోగేశ్వర్ మృతి చెంది కనిపించిందని, ఏనుగు మృతితో పోస్ట్ మార్టం నిర్వహించామని చెప్పారు. శవపరీక్షలో భోగేశ్వర్ సహజ కారణాలతోనే మరణించాడని నిర్ధారణ అయినట్లు చెప్పాడు. ఏనుగు శరీరంపై గాయం గుర్తులు లేవని చెప్పారు. అయితే, గత వారం భోగేశ్వర్‌తో మరో ఏనుగు తలపడిందని.. అప్పటి నుంచే ఈ మగ ఏనుగు కొంత బలహీనతకు గురైందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భోగేశ్వర్ దంతాల్లో ఒకటి 2.58 మీటర్లు ఉండగా.. మరొకటి 2.35 మీటర్లు ఉంది. ఇంత పొడవైన దంతాలు ఉన్నప్పటికీ.. భోగేశ్వర్ వాటి వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు మాత్రం లేవు అని అధికారులు తెలిపారు.