భోగి మంటలు, భోగి పళ్లు.. ఎందుకు? ఏమిటి? ఎలా?  - MicTv.in - Telugu News
mictv telugu

భోగి మంటలు, భోగి పళ్లు.. ఎందుకు? ఏమిటి? ఎలా? 

January 13, 2020

Bhogi mantalau.

మనిషిని ఇతర జంతుజాలానికి భిన్నంగా మలచింది అతని మనసే. కేవలం ఆహారం, శృంగారం, నిద్రతో సరిపెట్టుకోకుండా జీవితాన్ని వినోదమయం కూడా చేసుకుంటాడు మానవుడు. పూర్వకాలం ప్రపంచవ్యాప్తంగా ఆటపాటలతో సామూహిక వేడుకలు సాగేవి. ఇప్పుడూ సాగుతున్నా వాటిలో చాలా మార్పు వచ్చాయి. ప్రాంతాలను బట్టి పండగలు మారిపోతుంటాయి. కానీ ఏ పండగైనా ఒకటే లక్ష్యం… మనకు మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలన్నదే. 

తెలుగువారి బ్రాండెడ్ పండగ సంక్రాంతి కూడా అలాంటిదే. పంటలు ఇంటికొచ్చే వేళ సాగే వేడక మొత్తం మూడు రోజుల పండగ. భోగి, సంక్రాంతి, కనుమ పేరుతో బంధువులంతా ఒక చోట చేరి ధూంధాం చేస్తారు. మొదటి రోజు భోగితో వేడుకలకు శ్రీకారం చుడతారు. 

పాతకు వీడ్కోలు.. 

పాతకు వీడ్కోలు చెబుతూ, జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని భోగికి సిద్ధమవుతారు. పాత కర్రలు, పాతబట్టలు, ఇతర పనికిరాని సరంజామాతో చలిమంటలు వేసుకుంటారు. పాత సామగ్రిని చాలా కాలం ఉంచితే వాటిలో పాములు, తేళ్లు కాపురం పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని కాల్చేయడం ద్వారా ముప్పు తప్పించుకోవాలని మంటలు వేస్తారు. ఆ మంటల్లో నీళ్లు కాగబెటి స్నానాలు కూడా చేస్తారు. కొత్త దుస్తుల్లో మెరిసిపోతారు. ఆడపిల్లలు ముగ్గులతో ప్రతిభ చాటుతారు. సాయంత్రం గొబ్బిళ్లు పెడతారు. 

భోగి పళ్లు… 

పిల్లలను కూడా భాగమేయ్యే అతికొద్ది పండగల్లో ఇదొకటి. ఈ రోజు బుడ్డోళ్లపై భోగిపళ్లు పోస్తారు. అందరి ముందూ పోసే ఆ రేగుపళ్లు దిష్టి తగలకుండా వారిని కాపాడతాయని నమ్మకం. రేగుపళ్లతోపాటు చిల్లర నాణేలు, చెరుకుముక్కలు, శనగలు, ఇటీవల కొందరు చాక్లెట్లు కూడా కలుపుతున్నారు. చిల్లర కోసం పిల్లలు ఒకరిపై ఒకరుపడిపోతుంటూ పెద్దలు మురిసిపోతారు. భోగిపళ్ల వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉందని అంటారు. తలపై నడిమి భాగంలో బ్రహ్మరంధ్రం  ఉంటుందని, భోగిపళ్లను పోస్తే అతి క్రియాశీలంమై, జ్ఞాపక, గ్రాహణ శక్తిని పెంచుతుందని విశ్వసిస్తారు. రేగిపండుకు.. సంక్రాంతిని తీసుకొచ్చే సూర్యుడికీ మధ్య చిన్న బంధం ఒకటుంది. సంస్కృతంలో రేగిపండును అర్కఫలం అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడు పిల్లలను చల్లగా చూడాలన్న ఉద్దేశం కూడా భోగిపళ్ల వెనుక ఉంది. భోగిపళ్ల వెనుక ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. బదరికావనంలో ఘోర తపస్సు చేస్తున్న శివుడి కరుణ కోసం దేవతలు అతనిపై బదరీఫలాలు(రేగుపళ్లు) పోశారని అంటారు. 

మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి వచ్చేసింది.