పండగకు పాట కొత్త ఉత్సాహం తీసుకొస్తుంది. కొన్ని పాటలైతే మరింత జోష్ తెస్తాయి. గాయకుడిగా, గేయరచయితగా, సంగీత దర్శకుడిగా బహుముఖప్రజ్ఞతో లక్షలాదిమంది అభిమానం చూరగొన్న భోలే షావలి ఈసారి బోనాల పండగకు గమ్మత్తయిన పాటతో ముందుకొచ్చారు. ఎవరూ ఊహించని వేషభాషలతో బోనాల పాటను రూపొందించి విడుదల చేశారు. ‘సరే సరే, నేన్ బరా బరే’ అంటూ అమ్మవారి వేషంలో భోలేషావలి తన నటగాయకరచనా విశ్వరూపం ప్రదర్శించారు.
‘‘సరే సరే, నేన్ బరా బరే.. మైసమ్మనూ.. కట్ట మైసమ్మనూ..
కల్లు సాక పోస్తాండ్రు సరే సరే, మీ కళ్లు నెత్తికెక్కితే నేనూకొనొరే..
మోసాలే జేస్తే నేను గోస పెడతనూ.. మంచిగుంటే మహిమలతో ఆదుకుంటానూ..’
అంటూ ఈసాగే ఈ పాట కూడా విభిన్నమే. సాధారణంగా ఇలాంటి పండుగ పాటల్లో భక్తులు అమ్మవారి మహిమలను కొనియాడుతుంటారు. షావలి పాటలో అమ్మవారే భక్తులతో మాట్లాడుతూ, నీతినిజాయతీగా జీవించాలని హెచ్చరిస్తుంది. భక్తుల్లో పెరుగుతున్న పెడధోరణులను ఎత్తి చూసి, వారిని సన్మార్గంలోకి నడిపించేలా సాగుతుందీ పాట. షావలి అమ్మవారు పూనినట్లు అద్భుతంగా నటించి పాడారు ఈ పాటలో.