భూపాలపల్లిలో దారుణం.. మెడికోను కాళ్లూ, చేతులూ కట్టేసి - MicTv.in - Telugu News
mictv telugu

భూపాలపల్లిలో దారుణం.. మెడికోను కాళ్లూ, చేతులూ కట్టేసి

January 18, 2020

Bhoopalapalli.

ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థి అర్థాంతరంగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన భూపాలపల్లిలో కలకలం రేపుతోంది. కాలేజీకి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరిన అతను కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపట్టగా.. బావిలో శవమై తేలాడు. దీంతో విగతజీవిగా మారిన కొడుకును చూసి ఆ కన్నవాళ్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు. డాక్టర్ అవుతానన్న అతని కలను నిజం చేసుకోకుండా వెళ్లిపోయిన కొడుకు మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోధించడం స్థానికులను కదిలించింది.

భూపాలపల్లి రేగొండ మండలం కనపర్తికి చెందిన వంశీ(24).. ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ సెలవులు ఉండటంతో ఇంటికొచ్చిన వంశీ శుక్రవారం ఉదయం తిరిగి కళాశాలకు బయలుదేరాడు. ఈ క్రమంలోనే అదేరోజు సాయంత్రం 8 గంటల సమయంలో తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడాడు. తాను ఖమ్మం కళాశాలకు చేరినట్లు తెలిపాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో మృతుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా.. ఓ బావిలో శవమై తేలాడు. బావిలోంచి వంశీ మృతదేహాన్ని బయటకు తీశారు. 

అతని కాళ్లూ చేతులు కట్టేసి ఉన్నాయి. గుర్తు తెలియని దుండగులు అతని కాళ్లూ చేతులు కట్టేసి హత్యచేశారు. అనంతరం బావిలో పారేసి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. మరోవైపు వంశీ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బావి వద్ద ఉన్న కరెంట్‌ స్తంభానికి సీసీ కెమెరా ఉండడంతో ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.