శివనామ స్మరణతో ఆలయాలు హోరెత్తుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత. అలాంటిదే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా. మొత్తం ఏడాదికి ఒకే ఒక్కరోజు తెరిచే శివాలయం ఒకటి ఉంది. అది ఎక్కడ ఉందో, ఎందుకు ఒక్క రోజు మాత్రమే తెరుస్తారో తెలుసుకుందాం రండి.
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ కు 48 కిలో మీటర్ల దూరంలో రాయ్ సెన్ జిల్లాలో ఉన్న శివాలయం ఇది. దాదాపు వెయ్యేళ్ళకు పైనే పురాతనమైన ఈ శివాలయాన్ని ఏడాదికి ఒక్క రోజు మాత్రమే తెరుస్తారు. వెయ్యి అడుగుల ఎత్తైన కొండపై ఉన్న ఈ శివాలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లుగా చెబుతారు. చాలా ఏళ్ళు బాగానే ఉంది. కానీ ముస్లిం రాజుల పాలన వచ్చాక దేశంలో చాలా ఆలయాలు మూతబడ్డాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. అయితే మిగతావన్నీ తిరిగి తెరుచుకున్నాయి కానీ ఇది మాత్రం అలాగే మూతబడి ఉంది.
ఆ తర్వాత కొన్నాళ్ళకు అంటే 1974లో ఈ ఆలయాన్ని సామాన్య ప్రజల కోసం తెరవాలంటూ 1974లో ఉద్యమం జరిగింది. దాంతో అప్పట్లో సీఎంగా వ్యవహరిస్తున్న ప్రకాష్ సేథీ ఆలయ తాళాన్ని తీసి.. మహా శివరాత్రి రోజున మాత్రమే పూజలు నిర్వహించేందుకు అనుమతించారు. అప్పటి నుంచీ అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ నిర్వహణలో ఉన్నందున.. భక్తుల్ని శివరాత్రి రోజున మాత్రమే అనుమతిస్తారు.
అది కూడా శివరాత్రి ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దేవాలయాన్ని తెరుస్తారు. తాజాగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు కూడా తెరిచారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్న అంచనా వ్యక్తమవుతోంది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం భారీ ఎత్తున ప్రసాదాల్ని సిద్ధం చేస్తారు ఇక్కడ.