బైడెన్ ఎవరు? అతనితో భారత్‌కు లాభమా, నష్టమా? - MicTv.in - Telugu News
mictv telugu

బైడెన్ ఎవరు? అతనితో భారత్‌కు లాభమా, నష్టమా?

November 21, 2020

America

బైడెన్, బైడెన్, బైడెన్… ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. ఏ పేపర్ చదివినా, ఏ టీవీ చానల్ చూసినా, ఎవరితో మాట్లాడినా ఇదే మాట. సాధారణంగా ఒక దేశ ప్రజలు తమ దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు. ఇరుగు పొరుగు దేశాల గురించి కూడా కొంత మాట్లాడుకుంటారు. కానీ ప్రపంచం మొత్తం అమెరికా రాజకీయాల గురించి చాలా మాట్లాడుకుంటుంది. దీనికి కారణం అమెరికా బలమే. ఐటీ, ఆయుధాలు, సైన్స్, టెక్నాలజీ, సినిమాలు.. వంటి అనేకరంగాల్లో అమెరికా అగ్రదేశం. పెద్దన్నలా అన్ని దేశాలపై పెత్తనం చలాయిస్తుంది. అందుకే ప్రపంచానికి అమెరికా అంటే ఆసక్తి, భయం!

ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ తప్పుకుంటున్నాడు. కొత్త రాజు జోసఫ్ బైడెన్ అధికారంలోకి వస్తున్నాడు. అగ్గిరాముడిలా రేగిపోయే ట్రంప్ భారత్‌తో కాస్త బాగానే ఉండేవాడు. ప్రపంచ కాలుష్యానికి భారతే కారణమని, అమెరికన్ల ఉద్యోగాలను భారత్, చైనా ప్రజలు దోచుకుంటున్నారని తిట్టిపోసినా, మోదీతో ఆయన స్నేహంగానే ఉండేవాడు. ట్రంప్ అధిక ప్రసంగాలు, జాతివివక్ష చేష్టలు, పొగరు, నోటి దురద అతణ్ని ఇంటికి సాగపంపాయి.

మరి, అతని స్థానంలో వస్తున్న బైడెన్ ఏం చేస్తాడు? ట్రంప్‌కు, బైడెన్‌కు ఉన్న తేడాలేంటి?  ముఖ్యంగా భారతీయులకు ఉద్యోగాల విషయంలో బైడెన్ వైఖరి ఏమిటి? అతని వల్ల మన దేశానికి లాభమా, నష్టమా? అసలు బైడెన్ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసమే ఈ వీడియో..

బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. అతని అసలు పేరు జోసఫ్ రాబినట్ బైడెన్. జోసఫ్ పదం నుంచి జో అక్షరాన్ని తీసుకుని సింపుల్‌గా బైడెన్ అని పిలుస్తారు. బైడెన్ వయసు 78 ఏళ్లు. ప్రళయం వచ్చినా జంకనట్లు, చాలా ప్రశాంతగా కనిపించే బైడెన్ 1942లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‌లో ఓ కేథలిక్ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులకు ఐర్లాండ్, బ్రిటిష్, ఫ్రాన్స్ సంతతి మూలాలు ఉన్నాయి. ట్రంప్‌కు కూడా జర్మనీ మూలాలు ఉన్నాయి.

అమెరికా భిన్నదేశాల నుంచి వలస వెళ్లిన ప్రజల దేశం అని చెప్పుకుంటాం కదా. కానీ ట్రంప్ దీన్ని ఒప్పుకోడు. బైడెన్ దీనికి భిన్నంగా అమెరికా అన్ని జాతుల ప్రజలదీ అంటాడు. అధ్యక్ష ఎన్నికల్లో ఈ సామరస్య ధోరణి ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారింది.  భారత్, చైనా, ఆఫ్రికా మూలాలు ఉన్న అమెరికన్లు భారీ సంఖ్యలో బైడెన్‌కు జైకొట్టారు. 

బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని చేరుకోవడం అంత సులభంగా సాధ్యం కాలేదు. ఎన్నో కష్టాలు పడ్డాడు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. బైడెన్‌కు బాల్యంలో నత్తి ఉండేది. తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. ఆ లోపం ఆయనలో పట్టుదల పెంచింది. నత్తి లేకుండా మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటూ, కవిత్వం వల్లిస్తూ  ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. కొన్ని నెలల్లోనే నత్తిని పోగొట్టుకున్నాడు. బైడెన్ మంచి వక్తగా మారడం వెనక ఇంత కథ ఉంది. 

బైడెన్ కుటుంబ నేపథ్యం కూడా అతన్ని రాటుదేల్చింది. బైడెన్ తండ్రి మొదట్లో ధనవంతుడే అయినా తర్వాత దివాలా తీశాడు. అష్టకష్టాలు పడి పాతకార్ల వ్యాపారంలో కొంత సంపాదించాడు. మధ్యతరగతి నుంచి వచ్చిన బైడెన్‌కు సామాన్యుల కష్టాలు బాగా తెలుసు. బైడెన్‌కు ఇద్దరు భార్యల ద్వారా నలుగురు పిల్లలు పుట్టారు. వీరిలో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. తొలి కూతురు కారు ప్రమాదంలో చనిపోగా, ఒక కొడుకు 2015లో బ్రెయిన్ కేన్సర్‌తో కన్నుమూశాడు. ప్రస్తుతం రాబర్ట్ అనే కొడుకు, రెండో భార్యకు పుట్టిన ఏకైక సంతానం యాష్లీ అనే కూతురు ఉన్నారు. రాబర్ట్ ఓ బ్యాంకుకు వైస్ ప్రెసిడెండ్. యాష్టీ పర్యావరణ కార్యకర్త. 

జోసఫ్ బైడెన్ డెలవేర్ యూనివర్సిటీ, సిరక్యూస్ లా యూనివర్సిటీల్లో చదువుకున్నాడు. లా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. బైడెన్ ఇప్పుడు డెమోక్రాట్ పార్టీ నుంచి గెలిచినా.. యవ్వనంలో ఉన్నప్పుడు ఆ పార్టీని తీవ్రంగా విమర్శించేవాడు. 1972లో అతడు న్యూ క్యాజిల్ కౌంటీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడే అతని మొదటి భార్య, ఏడాద వయసున్న కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇద్దరు కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్న హాస్పిటల్ నుంచే బైడెన్ ప్రమాణ స్వీకారం చేశాడు. 

భార్య, కూతురి మరణంతో కుంగిపోయిన బైడెన్ కుటుంబాన్ని డెలవేర్ నుంచి వాషింగ్టన్‌కు మార్చాడు. స్కూల్ టీచర్ అయిన జిల్ జాకబ్స్‌ను పెళ్లి చేసుకున్నాడు. డెమోక్రటిక్ పార్టీలో అంచెలంచలుగా ఎదిగిన బైడెన్ 1987లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి తొలిసారి ప్రయత్నించాడు. లాయర్‌గా ఆయన పనితీరు సరిగ్గా లేదనే విమర్శలు ఉండేవి. 

బైడెన్ 2008లో మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించాడు. కానీ డెమోక్రాట్లు బరాక్ ఒబామాకు టికెట్ ఇచ్చారు. బైడెన్ ఉపాధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ఆ పదవితో సరిపెట్టుకున్నాడు. బైడెన్, ఒబామా ఇద్దరూ అమెరికా ప్రయోజనాల కోసం ఎనిమిదేళ్లు చాలా కష్టపడ్డారు. దానికి తగ్గ ఫలితం బైడెన్‌కు ఇప్పుడు అమెరికా పగ్గాలను కట్టబెట్టింది.  

భారత్‌కు ఏం ఒరుగుతుంది? 

అమెరికా సంగతి వదిలేస్తే బైడెన్ వల్ల భారత్‌కు లాభమా, నష్టమా అన్నది ఆసక్తికర అంశం. అమెరికా ఏ దేశంతోనైనా స్నేహంగా ఉందంటే అందులో కేవలం స్నేహమే ఉండదు. దాని ఆర్థిక ప్రయోజానాలే కీలకంగా ఉంటాయి. పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చే అమెరికా గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే భారత్‌కు మద్దతిస్తూ ఉంటుంది. దక్షిణాసియాలో చైనా, భారత్ బలపడితే తన అంతర్జాతీయ మార్కెట్, ఆధిపత్యం దెబ్బతింటాయని అగ్రరాజ్యానికి భయం. అందుకే సమయం దొరికినప్పుడల్లా ట్రంప్ భారత్, చైనాలను తిట్టిపోసేవాడు. 

బైడెన్ ధోరణి కూడా ఇంచుమించు అలాగే ఉండబోతోంది. పైకి స్నేహంగా ఉంటూనే అమెరికా ప్రయోజనాలకే అతడు పెద్ద పీట వేస్తాడని విశ్లేషకుల అంచనా. ట్రంప్‌తో మన ప్రధానమంత్రి మోదీకి మంచి సంబంధాలు ఉండేవి. ‘నమస్తే ట్రంప్’ అంటూ ఆయనకు అట్టహాసంగా స్వాగతం పలికారు మోదీ. మోదీ అమెరికాకు వెళ్లినప్పుడు ట్రంప్ కూడా ఘన స్వాగతం పలికాడు. కశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ మూకలు, అరుణాచల్ సరిహద్దులో చైనా మూకలు భారత జవాన్లపై దాడి చేసినప్పుడు ట్రంప్ భారత్‌కు అండగా నిలిచాడు. ఇది సహజంగానే ట్రంప్ వ్యతిరేకులైన డెమోక్రాట్లకు.. అంటే బైడెన్ పార్టీ నేతలకు గిట్టేది కాదు.

బైడెన్ కూడా భారత్‌పై విమర్శలు సంధించారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తాజా ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి డెమోక్రాట్ల నేత కమాలా హారిస్ కూడా భారత్‌ను విమర్శించింది.  బైడెన్ పార్టీలో పాకిస్తాన్‌కు అనుకూలంగా లాబీ నడుస్తోందని దీని ద్వారా స్పష్టమైంది. 

బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టాక కూడా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహారిస్తారా అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం. అమెరికా ప్రయోజనాలను బట్టి అతని ధోరణి ఉంటుంది. అమెరికాకు వలస వెళ్లే భారతీయులపై అతడు కొంత సానుకూలంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. 

ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలను అరికట్టడానికి ట్రంప్ చాలా ప్రయత్నించాడు. దీన్ని బైడెన్ తప్పుబట్టాడు. తాను అధికారంలోకి వస్తే వలస విధానంలో మార్పులు చేస్తానని హామీ ఇచ్చాడు. ఇది ఎన్నికల్లో ఆయుధంగా పనిచేసింది. ఇప్పుడు అతడు అధికారంలోకి వస్తున్నారు కనుక వలసలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఫలితంగా అమెరికాకు వలస వెళ్లే భారతీయులకు, చైనీయులకు మేలు కలుగుతుంది. 

అదే సమయలో బైడెన్ పాక్, చైనాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశమూ కనిపిస్తోంది. అదే నిజమైతే భారత్‌కు చిక్కులే. అయితే భారత్‌ను బుజ్జగించడానికి బైడెన్ కొన్ని బుజ్జగింపు చర్యలు కూడా తీసుకోవచ్చు. ఉగ్రవాద నిర్మూలన, మార్కెట్ విస్తరణ అనేవి అమెరికా ప్రధాన లక్ష్యాలు కనుక.. బైడెన్ అవసరమైతే చైనా, పాకిస్తాన్‌లను వ్యతిరేకించే అవకాశమూ లేకపోలేదు. 

ఏది ఏమైనా బైడెన్‌కు అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. అతడే కాదు.. అమెరికా అధ్యక్ష పదవిలో కూర్చునే ఎవరైనా, ఆడ అయినా, మగ అయినా, మరొకరైనా ప్రపంచంపై పెద్దన్నలా కర్రపెత్తనం సాగిస్తారు. భారత్‌తో స్నేహం చేసినా, పాకిస్తాన్‌ను చేరదీసినా, చైనా అధిపత్యాన్ని వ్యతిరేకించినా అమెరికా నేతల అంతిమ లక్ష్యం ఒకటే. భారత్, పాక్, శ్రీలంక లాంటి దేశాలకు వీలైనన్ని ఎక్కువ ఆయుధాలను, సరుకులను అమ్ముకుని లాభాలు దండుకోవడం!  దీని కోసం ఇచ్చే వాళ్లు ఇచ్చే షేక్‌హ్యాండ్‌కు ముద్దుపేరు స్నేహం, సత్సంబంధం.. అంతే, మరేం లేదు!