బిగ్ బ్రేకింగ్: మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఆయనతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలోనూ సోదాలు చేపట్టారు. దాదాపు 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇటీవల కరీంనగర్‌లో టీఆర్ఎస్ మంత్రి గంగుల కమాలకర్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ అధికారులు ఉమ్మడిగా సోదాలు నిర్వహించగా.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర ఇంట్లో తనిఖీలు జరిగాయి. అవి జరిగి కొద్దిరోజులు కాకముందే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరగడం టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.