BIg Challenges to Mallikarjun Kharge
mictv telugu

ఓల్డ్ కెప్టెన్..యంగ్ టీమ్…కాంగ్రెస్‌ని కాపాడుతుందా?

October 26, 2022

BIg Challenges to Mallikarjun Kharge

గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఓల్డ్ కెప్టెన్. 2024 ఎలక్షన్స్ బిగ్ టాస్క్. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి..కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అడ్రెస్ లేకుండా పోయిన కాంగ్రెస్ ని యువమంత్రతో పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. 50 శాతం పదవులు,సీట్లు వారికే ఇవ్వాలని ఓల్డ్ కెప్టెన్ డిసైడ్ అయ్యారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు గాంధీల రిమోట్ కంట్రోల్‌లా కాకుండా పార్టీకి సెన్సార్ లా పనిచేసేలా మిషన్ 2024 కు ప్లాన్ చేస్తున్నారు.

1998 టు 2022..అప్పట్లో సోనియా..ఇప్పుడు ఖర్గే

1998 వ సంవత్సరం.కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో వుంది.సరిగ్గా అప్పుడే సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. మూడురాష్ట్రాల్లో మాత్రమే పార్టీ అధికారంలో వుంది.మిగతా రాష్టాల్లో బీజేపీ గాలికి కొట్టుకుపోయింది. మధ్యప్రదేశ్ , మిజోరం, ఒడిషాలోనే కాంగ్రెస్ అధికారంలో వుంది. ప్రస్తుతం ఇంచుమించు అదే పరిస్థితి.రాజస్థాన్ ,ఛత్తీస్ ఘడ్ లోను అధికారం కొనసాగిస్తోంది. రాజస్థాన్ లో వర్గవిభేదాలతో రచ్చ రచ్చ నడుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. 1998 నుంచి ఆరేళ్లు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. విదేశీ కార్డుతో పాటు అనుభరాహిత్యాన్ని బీజేపీ ఫోకస్ చేసి విమర్శించింది. ఇవేవి పట్టించుకోని సోనియా ఆరేళ్లు తీవ్రంగా శ్రమించి 2004 లో కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొచ్చారు.

ఖర్గే ముందు అంతకు మించి సవాళ్లు

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బుధవారం మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. కార్మికుడి కొడుకు కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం కలలో కూడా ఊహించలేమని ఖర్గే అన్నారు. “పార్టీని ఉన్నతస్థాయిలో నిలబెట్టేందుకు అహర్నిశలూ కృషి చేస్తా. కేడర్ ని కాపాడుకోవడం, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం మన అందరి ముందున్న లక్ష్యం. రాహుల్ భారత్ జోడో యాత్ర లక్ష్యాన్ని వృధా కానివ్వబోను..”అని తొలి ప్రసంగంలో ఖర్గే చెప్పారు.ఇప్పుడు ఖర్గే ముందు 1998, అంతకు మించిన సవాళ్లు ఉన్నాయి. కేంద్రంలో వున్న నరేంద్రమోదీ ఒక్కరే కాదు..దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ సైలెంట్ గా దేశరాజకీయాల్లోకి విస్తరిస్తున్నారు.పంజాబ్ లో కాంగ్రెస్ అధికారాన్ని తుడిచిపెట్టిన కేజ్రీవాల్…ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారు. ఎలాగూ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఎంఐఎంతో రిలేషన్స్ అంతంత మాత్రమే.రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా వుంది. ఇన్ని సవాళ్ల మధ్య కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్ని మల్లికార్జున ఖర్గే చేపట్టారు. 2024 బిగ్ టాస్క్‌కు ముందు పలురాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు సవాల్ గా మారాయి. గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే తనమార్క్ చూపించాలి. ఈ ఎన్నికల్లో నెట్ ప్రాక్టీస్ తో కాంగ్రెస్ ని నిలబెట్టాలి. అప్పుడు మల్లికార్జున ఖర్గేపై కేడర్ నమ్మకం కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీశ్రేణుల్లో ఉత్సాహం వస్తుంది.కాంగ్రెస్‌కు దూరమైన వర్గాల్ని చేరదేసి ఓట్లుగా మలుచుకోవాలి.

యువరక్తాన్ని ఎక్కించాలి

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నడి సంద్రంలో మునిగిపోయే బోటులా వుంది.. ఈ పార్టీకి యువరక్తాన్ని ఎక్కించాలి. ఇదే ఖర్గే ముందున్న తక్షణ కర్తవ్యం. కాంగ్రెస్ లో ఓ వెలుగువెలిగిన గులాబీ నబీ ఆజాద్, జ్యోతిరాధిత్యా సింధియా,జితిన్ ప్రసాద్ లాంటి నేతల్ని పార్టీ చేజార్చుకుంది. ఇప్పుడు అలాంటి నేతల్ని ఖర్గే తయారుచేసుకోవడం అంతా ఈజీ కాదు.

సమన్వయం మరో సవాల్

కాంగ్రెస్‌లో కురువృద్దులు ఎక్కువ. ఉత్సాహంతో పనిచేసే యువకులూ వున్నారు.కానీ వీరి మధ్య సమన్వయం ఉండదు.ఎవరికివారే యమునా తీరే.పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరిస్తారు. ఇలాంటి వాళ్లను కంట్రోల్ లో పెట్టడం మల్లికార్జున ఖర్గే ముందున్న మరో సవాల్.

సమయం లేదు మిత్రమా

గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఎక్కువ సమయం లేదు. మరో 18 నెలల్లోనే జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈలోపు పార్టీని చక్కదిద్దడంతో పాటు మిత్ర పక్షాల్ని సమన్వయం చేసుకోవాలి. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టాలి. కొత్త మిత్రుల్ని వెతికే పనిని ముమ్మరం చేయాలి. బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చేలా శ్రేణుల్ని తయారు చేయాలి.

రిమోట్ కంట్రోల్ కాదని…

మల్లికార్జున ఖర్గే సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన నేత.పార్టీలో మంచి పేరు, పట్టు ఉంది. వివిధ రాష్ట్రాల నేతలతో పరిచయాలు వున్నాయి.పార్టీని సమర్థంగా నడిపించే సత్తా వుంది. వీటి అన్నింటి కన్నా ముందు గాంధీల కుటుంబం రిమోట్ కంట్రోల్ కాదని నిరూపించుకోవాలి.మోదీని ఎదుర్కొవడం రాహుల్ వల్ల కాదని, ఏకంగా తానే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రయత్నించారు. రాజస్థాన్ సంక్షోభంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.ఇప్పుడు అశోక్ గెహ్లాట్ కూడా మల్లికార్జున ఖర్గేకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. “ఇది కొత్త ఇన్నింగ్స్, పార్టీ పటిష్టతకోసం మల్లికార్జున ఖర్గేతో కలిసి పనిచేస్తా’ అని ఆయన చెప్పారు.

రాహుల్ జోడో యాత్రలో ఉండగానే

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో వుండగానే కాంగ్రెస్ కొత్త అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం.అయినా గాంధీల విధేయుడు ఖర్గేనే సారథి అయ్యారు. ఇతన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని పనిచేయస్తారా అని ఆ పార్టీ శ్రేణుల్లో సందేహం వుంది. స్వేచ్ఛగా వదిలిస్తేనే పార్టీకి పునర్ వైభవం వస్తుందని కేడర్ ఆశిస్తోంది. మల్లికార్జున ఖర్గే ముందుగా తన టీమ్‌ను సమర్థులతో ఏర్పాటు చేసుకోవాలి. అనుభవం వున్న నేతలతో పాటు కీలక యువనేతల్ని టీమ్ లోకి తీసుకోవాలి.అప్పుడే కాంగ్రెస్ కు దూరమైన వర్గాలు మళ్లీ దగ్గరకు వస్తాయి. కార్మిక నాయకుడి నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన మల్లికార్జున ఖర్గేకు దళిత, వెనుకబడిన వర్గాల్లో ప్రత్యేక క్రేజ్ వుంది. మళ్లీ ఆ వర్గాల్ని ఆకట్టుకునే అవకాశం ఆయనకే వుందని పార్టీ కేడర్ బలంగా నమ్ముతోంది.