Big Conspiracy Behind Adani Won Six Airports Contracts
mictv telugu

రూల్స్ బ్రేక్ చేసి మరీ అదానీకి ఆరు ఎయిర్‌పోర్టుల బిడ్డింగులు

January 26, 2023

అదానీ గ్రూప్‌ షేర్లలో అవకతవకలు, అకౌంటింగ్ లో మోసాలు జరుగుతున్నాయని ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం గాలి బుడుగే అన్న హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆ గ్రూప్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీంతో పాటే అదానీ బ్రాండ్ వాల్యూపై ఎప్పటినుంచో ఉన్న అనుమానాలు, ఆరోపణలు మరింతగా బలపడ్డాయి. అదానీ ఇంతలా ఎలా ఎదిగారు? ఆయన సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటీ అన్న ప్రశ్నలకు సమాధానాలు బహిరంగ రహస్యాలే అయిప్పటికీ తాజా వివాదంతో అవి మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఏయిర్ పోర్ట్ నిర్వహణ కాంట్రాక్ట్ లు దక్కించుకోవడం అందులో ఒకటి.

ఎనిమిదేళ్లలో ఎన్ని కోట్లో..

కష్టపడి పైకొచ్చిన వ్యక్తిని మెచ్చుకోవడం తప్పు కాదు కానీ 8 ఏండ్లలోనే ఎవరూ ఊహించనంతగా ఎదిగిన గౌతమ్ అదానీ సక్సెస్ ను మాత్రం కాస్త అనుమానించాల్సిందే అని ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక తేల్చి చెప్పింది. వ్యవసాయం, విద్యుత్తు ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల కోసం 1988 లో ‘అదానీ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌’ అనే ఓ చిన్న సంస్థను స్థాపించి మూడున్నర దశాబ్దాల్లో అనేక రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని అదానీ విస్తరించారు.1991 నాటి సరళీకరణ, ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఆయన వ్యాపార ప్రస్థానం చాలా వేగంగా సాగింది. అయితే మోడీ ప్రధానమంత్రి అయిన ఈ ఎనిమిదేళ్లలోనే ఎన్నడూలేనంతగా అదానీ ఆదాయం, వ్యాపార సామ్రాజ్యం పెరగడంపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి.

ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఆరు

ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే అతి తక్కువ సమయంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ నిలిచారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తారు. మోడీ ప్రధాని అయ్యాక అదానీ పేరు, ఆస్తులు రెండూ నిమిష నిమిషానికి పెరిగాయని విమర్శిస్తారు. 2018లో ఆరు ఏయిర్ పోర్ట్ లను అదానీకి కట్టబెట్టడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తారు. అహ్మదాబాద్, మంగళూరు, లక్నో, జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయంతో అదానీకి ప్రయోజనం కలిగిందంటారు. ఆ సమయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, సడలించిన నిబంధనలు వివాదాస్పదం అయ్యాయి.

హెచ్చరికలు బేఖాతరు

కేంద్ర ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్‌ నిబంధనల ప్రకారం ఈ ఆరు ఏయిర్‌ పోర్ట్‌ ప్రాజెక్టుల్లో ఒకే బిడ్డర్‌కు రెండుకు మించి విమానాశ్రయాలను ఇవ్వకూడదు. అలా ఇస్తే పనితీరు సమస్యలు వస్తాయి. ఇక వేర్వేరు బిడ్డర్లకు అవకాశం ఇస్తే పోటీ ఎక్కువగా ఉండి ప్రభుత్వానికి లాభం కలుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ వాదించింది. సాంకేతిక సామర్థ్యం, గత అనుభవం లేని బిడ్డర్లకు ఎయిర్‌పోర్టుల నిర్వహణను ఇవ్వొద్దని నీతీ ఆయోగ్ సూచించింది. కానీ ఈ అభ్యంతరాలను పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ అస్సలు పట్టించుకోలేదు. ముందస్తు అనుభవం అక్కర్లేదని ఎంపవర్డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ సెక్రటరీస్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆరు ఎయిర్‌పోర్టులనూ అదానీకే కట్టబెట్టింది.

బిడ్డింగ్ కోసం  బెదిరించి..

ఆరు ఎయిర్‌పోర్టులకు సంబంధించి హయ్యెస్ట్‌ బిడ్డర్‌గా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ నిలిచినట్టు 2019 ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఆ ఆరు ఎయిర్‌పోర్టులనూ అదానీకి అప్పజెప్పడం కోసమే.. ఎలాంటి అనుభవం లేనివారు కూడా బిడ్లు వేసేలా నిబంధనలను ప్రభుత్వం మార్చిందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఇంతేకాదు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్రముఖ వ్యాపార సంస్థను ఐటీ దాడులతో బెదరించి ఆ బిడ్డింగ్ లో పాల్గొనకుండా చేశారన్న విమర్శలూ వినిపించాయి. ఇక 50 ఏళ్ల పాటు త్రివేండ్రం ఎయిర్‌పోర్టు నిర్వహణ లీజును అదానీ సొంతం చేసుకోవడాన్ని నాటి కేరళ ప్రభుత్వం తప్పుపట్టింది. ఎంతో వివాదాస్పదం అయిన ఆ విమానాశ్రయాల కాంట్రాక్ట్ తో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ ఎయిర్‌పోర్టు ఆపరేటర్స్‌లో ఒకటిగా అదానీ గ్రూప్ నిలిచింది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వ టెండర్లను దక్కించుకోని ఈ ఎనిమిదేళ్లల్లో ఆస్తుల్ని 230 శాతానికి పైగా పెంచుకున్నట్టు అదానీపై ఆరోపణలు కూడా ఉన్నాయి.