Big 'Gi' Rakhi for RTC..Record collections in one day
mictv telugu

ఆర్టీసీకి భారీ ‘గి’రాఖీ..ఒక్క రోజులోనే రికార్డ్ వసూళ్లు

August 14, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రాఖీ పండగ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా ఆయా రాష్ట్రాల పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాఖీ పండగను పురస్కరించుకొని ఆయా రాష్ట్రాల్లో ఆడపడుచులందరు పట్టణాల నుంచి పల్లెటూర్లకు బయలుదేరడంతో ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది.

ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ శుక్రవారం ఒక్కరోజే రికార్ట్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. రోజువారీ ఆదాయంతో పోలిస్తే, టీఎస్ ఆర్టీసీ రికార్డులను తిరగరాసింది. ఒక్క రోజులోనే టీఎస్ ఆర్టీసీ ఆదాయం రూ. 20కోట్లు దాటింది. ఈ అదాయానికి సంబంధించిన వివరాలను అధికారులు కాసేపటిక్రితమే వెల్లడించారు. ”సాధారణంగా రోజువారీ ఆదాయంగా రూ.15.50 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తాం. రకరకాల చార్జీల పెంపుతో ఇటీవల రోజువారీ ఆదాయం రూ. 19కోట్లు దాటుతోంది. సోమవారాల్లో ఆ లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమిస్తోంది. మామూలు రోజుల్లో రూ. 18 నుంచి 15 కోట్ల వరకు సమకూరుతుంది. తెలంగాణలో రాఖీ పౌర్ణమికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్క రోజులోనే ఆర్టీసీ ఆదాయం రూ. 20. 11కోట్లు లభించటం విశేషం. ఆర్టీసీ చరిత్రలో ఇది అపూర్వం” అని అధికారులు అన్నారు.

టీఎస్ఆర్టీసీ పరిధిలోని కరీంనగర్ జోన్లో అత్యధికంగా 8.79 కోట్లు, హైదరాబాద్ జోన్లో రూ. 5, 85 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రూ.5.47 కోట్ల వంతున ఆదాయం లభించగా, లక్ష్యానికి మించి రూ. 4.51కోట్ల అదనపు ఆదాయాన్ని వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్కరోజే మొత్తం 38.77 లక్షల మంది రాకపోకలు సాగించారు.