ఓటీటీలో సినిమాలు విడుదల కావడం వల్ల నష్టపోతున్నామంటున్న టాలీవుడ్ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత పది వారాలు (రెండున్నర నెలలు) గడిచాకే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. పెద్ద సినిమాలు 10 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని తెలుగు సినీ నిర్మాతల మండలి(టీఎఫ్‌పీసీ) నిర్ణయించింది.
అలాగే పరిమిత బడ్జెట్‌తో తీసిన చిత్రాలు 4 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించారు. రూ. 6 కోట్లలోపు బడ్జెట్ చిత్రాలపై తదుపరి చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేదుకు కృషి చేయాలని సంకల్పించారు. సాధారణ, సిక్లాస్ సెంటర్లలో ధర రూ.100 రూ.70గా ఉంచాలని, మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125, రూ.150 కు మించకూడదని నిర్ణయించారు. సినిమా ప్రదర్శనకు వీపీఎఫ్ ఛార్జీలు ఎగ్జిబిటర్లే చెల్లించాలని తేల్చారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగులను నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించారు.